తుమకూరులో మాజీ ఉగ్రవాది విచారణ
బనశంకరి/ తుమకూరు: ఢిల్లీలో ఎర్రకోట వద్ద కారుబాంబు పేలుడు నేపథ్యంలో, గతంలో అరెస్ట్ చేసిన అనుమానిత ఉగ్రవాదులను బెంగళూరు పోలీసులు తీవ్ర విచారణ చేపడుతున్నారు. ఐదేళ్ల క్రితం బెంగళూరు సంజయ్‌నగరలో అరైస్టెన డాక్టర్‌కు, ఈ పేలుడుతో సంబంధం ఉందా అనేది ఆరా తీస్తున్నారు. అలాగే తుమకూరులో దర్యాప్తు సాగుతోంది. డాక్టర్ ముజాహిద్దీన్ దేశద్రోహి కార్యకలాపాల్లో పాల్గొన్నాడని గతంలో ఎన్‌ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఆరేళ్ల పాటు ఢిల్లీ తీహార్ చెరసాలలో ఉండి విడుదలయ్యాడు, తుమకూరు జిల్లాలో నివసిస్తున్నాడు. ముజాహిద్దీన్ ను జిల్లా ఏఎస్పీ పురుషోత్తమ్ నేతృత్వంలో ప్రశ్నించారు. ఢిల్లీ కారు బాంబు పేలుడుతో ఏమైనా సంబంధం ఉందా అని విచారించి వదిలి పెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. గతంలో కలిఫత్ ఉగ్రవాద సంస్థ ప్రముఖులకు తుమకూరులో భేటీకి సహకారం ఇచ్చాడు. ఆ సంస్థ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.


