బాగల్‌కోట భగభగ | - | Sakshi
Sakshi News home page

బాగల్‌కోట భగభగ

Nov 14 2025 8:14 AM | Updated on Nov 14 2025 8:14 AM

బాగల్

బాగల్‌కోట భగభగ

బనశంకరి: చెరకు పెండింగ్‌ బిల్లులను చెల్లించాలని, నాణ్యతతో సంబంధం లేకుండా టన్నుకు రూ.3,500 ధర చెల్లించాలని తదితర డిమాండ్లతో ఉత్తర కర్ణాటక జిల్లాల్లో చెరకు రైతులు గత రెండువారాలుగా ఆందోళనలు చేయడం తెలిసిందే. రూ.3,500 ధర ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పలు జిల్లాల్లో రైతులు శాంతించారు. కానీ బాగల్‌కోట జిల్లాలో గురువారం సాయంత్రం హఠాత్తుగా రైతుల నిరసన ఉగ్రరూపం దాల్చింది. చక్కెర కర్మాగారం ముందున్న చెరుకు లోడ్లకు నిప్పంటించారు. ఈ ఘటన బాగల్‌కోటే జిల్లా మహాలింగపుర పట్టణంలో చోటుచేసుకుంది.

ఫ్యాక్టరీ ముందు రభస

వివరాలు ఇలా ఉన్నాయి.. మహాలింగపుర పట్టణంలోని సమీరవాడి వద్ద గోదావరి చక్కెర పరిశ్రమ ముందు పెద్దసంఖ్యలో చెరకు ట్రాక్టర్లు నిలిపి ఉన్నాయి. అక్కడ శుక్రవారం నుంచి చెరకు క్రషింగ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన పేరుతో కొందరు చేరుకుని వాహనాలకు నిప్పంటించారు. ఘటన సమయంలో సుమారు 150 ట్రాక్టర్లు ఉన్నాయి. ఫ్యాక్టరీ యజమానులు గతంలో చెరకు రైతులకు పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు గురించి నోరువిప్పలేదు, అంతేగాక ప్రతి టన్ను చెరకు కు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రూ.3,500 ధర ఇవ్వాలని రైతులు మహాలింగపుర పట్టణంలో రాస్తారోకోకు దిగారు. కొన్ని గంటల్లోనే ఇది హింసాత్మక రూపం దాల్చింది.

ముధోళ్‌లో గలాటా

అంతేగాక ముధోళ్‌ పట్టణంలో రైతుల పోరాటం చేస్తుంటే చక్కెర ఫ్యాక్టరీ యజమానులు చర్చలకు రాలేదని రైతులు మండిపడ్డారు. ఆక్రోశంతో ఉన్న రైతులు గోదావరి చక్కెర ఫ్యాక్టరీ ముట్టడికి వచ్చారు. కనీసం 50 ట్రాక్టర్లకు మంటలు పెట్టారు. రాళ్ల దాడికి కూడా పాల్పడ్డారు. ఫ్యాక్టరీ సిబ్బంది మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అలాగే ముధోళ్‌ నుంచి వస్తున్న ట్రాక్టర్లను దారిలో అడ్డుకుని అగ్గి పెట్టారు. పరిస్థితి రణరంగంగా మారింది.

పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు చేరుకుని లాఠీలకు పనిచెప్పాయి, రాళ్ల దాడుల్లో కొందరు పోలీసులకు గాయాలు తగిలాయి. ముధోల్‌లో ఉదయం నుంచి బంద్‌సాగింది, వ్యాపారులు అంగళ్లను మూసివేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ముధోళ్‌, జమఖండి, రబకవి– బనహట్టి తాలూకాల్లో 16వ తేదీ ఉదయం వరకు జిల్లా కలెక్టర్‌ సంగప్ప 144 సెక్షన్‌ నిషేధాజ్ఞల్ని విధిస్తున్నట్లు తెలిపారు.

చక్కెర ఫ్యాక్టరీ ముందున్న చెరకు ట్రాక్టర్లకు నిప్పు

హింసాత్మకమైన చెరకు రైతుల నిరసన

మహాలింగపురం వద్ద ఉద్రిక్తతలు

పోలీసుల లాఠీచార్జీ, రైతుల

రాళ్లదాడులు

పలు తాలూకాలలో నిషేధాజ్ఞలు

బాగల్‌కోట భగభగ1
1/2

బాగల్‌కోట భగభగ

బాగల్‌కోట భగభగ2
2/2

బాగల్‌కోట భగభగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement