మేకెదాటుపై అప్పుడే జోక్యమా?
బనశంకరి: కావేరి నదిపై కర్ణాటక చేపట్టే మేకెదాటు ప్రాజెక్టును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి తో కూడిన ధర్మాసనం విచారణ జరిపారు. ఈ పథకం కావేరి ట్రిబ్యునల్, కేంద్రజల సంఘం వద్ద పరిశీలనలో ఉంది. ఇంకా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు, ఈ నేపథ్యంలో జోక్యం చేసుకోలేమని తమిళనాడు పిటిషన్‌ను కొట్టివేశారు. మేకెదాటును నిర్మించరాదని తమిళనాడు ప్రభుత్వం ముందునుంచీ వ్యతిరేకిస్తుండడం తెలిసిందే. ఈ ప్రాజెక్టు బెంగళూరుకు తాగునీటి కోసమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
తమిళనాడు వాదనలు
సుప్రీంలో తమిళనాడు తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గి వాదిస్తూ మేకెదాటు పథకం వల్ల కావేరి నదిపై ఆధారపడిన తమిళనాడు రైతులకు ఇబ్బంది తలెత్తవచ్చునని అన్నారు. అక్కడ జలాశయం నిర్మిస్తే తమిళనాడుకు నీరివ్వడానికి ప్రతికూలంగా మారుతుందని అన్నారు.
విజయం దక్కింది: డీసీఎం
కర్ణాటక తరఫున వాదించిన వకీలు శ్యామ్ దివాన్.. తమిళనాడు పిటిషన్ తప్పులతో కూడుకుందని వాదించారు. సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్రానికి న్యాయం దక్కిందని డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ తెలిపారు. ఇది మన హక్కు, మేము మేకెదాటు పథకాన్ని కొనసాగిస్తామని, ఇది మన ప్రాంతంలో నిర్మాణం అవుతుందని, ఇది బెంగళూరు ప్రజల విజయమన్నారు. తమిళనాడు నీటి వాటాకు ఇబ్బంది లేదని, పైగా లాభమని చెప్పారు.
తమిళనాడు అర్జీని కొట్టివేసిన సుప్రీం


