కాలేజీలో తేనెటీగల దాడి | - | Sakshi
Sakshi News home page

కాలేజీలో తేనెటీగల దాడి

Nov 14 2025 8:14 AM | Updated on Nov 14 2025 8:14 AM

కాలేజీలో తేనెటీగల దాడి

కాలేజీలో తేనెటీగల దాడి

యశవంతపుర: చిక్కమగళూరు పట్టణంలో పీయూసీ విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. గురువారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఓ అబ్బాయి చెట్టుపై ఉన్న తేనె పట్టు మీదకు రాయి విసిరాడు. దీంతో తేనెటీగలు లేచి విద్యార్థులపై దాడి చేశాయి. భయంతో తలోదిక్కుకు పరుగులు తీశారు. 25 మంది విద్యార్థులను తీవ్రంగా కుట్టడంతో నొప్పితో కేకలు వేశారు. అస్వస్థతకు గురైనవారిని పట్టణ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.

పోక్సో కేసులో యడ్డికి ఎదురుదెబ్బ

యశవంతపుర: బీజేపీ మాజీ సీఎం బీఎస్‌ యడియూరప్పకు హైకోర్టులో చుక్కెదురైంది.

పోక్సో కేసులో ఆయనకు ఇటీవల పోక్సో కోర్టు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. వాటిని రద్దు చేయాలని ఆయన హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గురువారం న్యాయమూర్తి ఎం.ఐ అరుణ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. పోక్సో కోర్టు ఇచ్చిన సమన్స్‌ను రద్దు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో యడ్డి కి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే కచ్చితంగా కోర్టు వాయిదాలకు హాజరు కావాలని ఆయనను ఒత్తిడి చేయరాదని ఆదేశించడంతో కొంతలో కొంత ఊరట లభించింది. కేసులోని సాక్ష్యాధారాలను బట్టి విచారణ సాగించవచ్చని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తన 17 ఏళ్ళ కుమార్తైపె యడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో బెంగళూరు పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.

మాదేశునికి కాసుల వర్షం

మైసూరు: రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర బెట్ట ఆలయానికి 27 రోజుల్లో భక్తుల నుంచి రూ.2.70 కోట్ల కానుకలు లభించాయి. గురువారం దేవస్థానపు హుండీలను లెక్కించారు. దీపావళి, సెలవులు, కార్తీకం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉండి మహదేశ్వరునికి కాసుల వర్షం కురిసింది. రూ.2,70,10,492 నగదు, 43 గ్రాముల బంగారం, కొంత వెండి సొత్తు లభించింది. చలామణిలో లేని రూ.2 వేల నోట్లు 10, 40 విదేశీ కరెన్సీ నోట్లు హుండీలలో లభించాయి.

ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు అనుమతి

దొడ్డబళ్లాపురం: కలబుర్గి జిల్లా చిత్తాపురలో ఆర్‌ఎస్‌ఎస్‌ చేపట్టాలనుకున్న కవాతుకి ఎట్టకేలకు ఆ జిల్లా కలెక్టర్‌ అనుమతి ఇచ్చారు. ఇందుకు కొన్ని షరతులను విధించారు. 16న చిత్తాపురలో ఆర్‌ఎస్‌ఎస్‌ మార్చ్‌ జరగనుంది. ఇందులో 300 మంది మాత్రమే పాల్గొనాలని ముఖ్య షరతు విధించారు. ఇంతకు ముందు కలబుర్గి హైకోర్టులో 800మందికి అనుమతి ఇవ్వాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు కోరారు. మరో 25 మంది బ్యాండ్‌ బృందంలో ఉండడానికి అనుమతించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement