వెట్టి చాకిరీ చేయించుకున్నారు
రాయచూరు రూరల్: మహిళా శిశు సంక్షేమ శాఖలో అధికారులు తనతో వెట్టి చాకిరీ చేయించుకున్నారని బాధితురాలు నరసమ్మ ఆరోపించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. దేవదుర్గ తాలూకా జాలహళ్లి అంగన్‌వాడీ కేంద్రంలో వంట పని మనిషిగా విధులు నిర్వహించే తనను ఆకస్మికంగా విధుల నుంచి తొలగించారని వాపోయింది. గత 30 నెలల నుంచి విధులు నిర్వహించినా వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకున్నారన్నారు. ఉద్యోగం లేక వేతనాలు ఇవ్వక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. దేవదుర్గ తాలూకా సీడీపీఓ, సూపర్‌వైజర్లు ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేశారని దుయ్యబట్టారు. అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్న తనను కాదని మరొకరిని విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు. తనకు అన్యాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి చేశారు.


