రాజుకుంటున్న రైతు ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

రాజుకుంటున్న రైతు ఉద్యమం

Nov 14 2025 8:14 AM | Updated on Nov 14 2025 8:14 AM

రాజుకుంటున్న రైతు ఉద్యమం

రాజుకుంటున్న రైతు ఉద్యమం

సాక్షి, బళ్లారి: తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రెండో పంటకు నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, తుంగభద్ర గేట్లను మార్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శిస్తూ రైతులు చేపడుతున్న ఆందోళనకు విపక్ష నేతల మద్దతు పూర్తి స్థాయిలో లభించడంతో ఆందోళన పతాక స్థాయికి చేరింది. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల పరిధిలో 8 జిల్లాలకు లక్షలాది ఎకరాల్లో సాగు నీరు అందించే తుంగభద్ర డ్యాంలో నీరు ఉన్నప్పటికీ రబీ పంటకు నీరు ఇవ్వలేమని సర్కార్‌ చెబుతున్న నేపథ్యంలో గురువారం మాజీ మంత్రి శ్రీరాములు, రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కేఎస్‌.దివాకర్‌, మాజీ లోక్‌సభ సభ్యుడు కే.విరుపాక్షప్ప ఆధ్వర్యంలో రైతులు పెద్ద సంఖ్యలో చేరి తుంగభద్ర డ్యాం సమీపంలోని మునిరాబాద్‌ వద్ద ప్రత్యేకంగా సమావేశమై రైతుల సమక్షంలో రెండవ పంటకు నీరు అందించే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు.

సరైన నిర్ణయం తీసుకోకపోవడమే శాపం

గత ఏడాది తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్‌గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో నిపుణులు 33 గేట్లను మార్చాలని సూచించినా కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో రైతులకు శాపంగా మారింది. పాలకులు చేసిన తప్పిదానికి డ్యాంలో దాదాపు 80 టీఎంసీల నీరు ఉన్నా గేట్లు మార్చాలనే సాకుతో లక్షలాది ఎకరాలను బీళ్లుగా మార్చేందుకు రబీ పంటకు నీరు ఇవ్వలేమని ప్రకటించిన పాలకులకు రైతులు సరైన బుద్ధి చెబుతారని, ఈ ప్రాంతంలో వ్యవసాయమే రైతులు జీవనాధారంగా చేసుకొని తుంగభద్ర డ్యాంను నమ్ముకొని పంటలను పండించుకొని పొట్టనింపుకుంటున్నారన్నారు. దేవుడు వరమిచ్చినా పూజారి వరం ఇవ్వని చందంగా వరుణ దేవుడు కృపా కటాక్షాలతో డ్యాంలో రబీ పంటకు సరిపడేంత నీరు ఉన్నా రబీలో క్రాప్‌ హాలిడే ప్రకటించడం సరైన చర్య కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

15న రైతులతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తాం

బెంగళూరులో శుక్రవారం నీటిపారుదల సలహా సమితి(ఐసీసీ) సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రబీ పంటకు నీరు ఇచ్చే విషయమై సరైన నిర్ణయం తీసుకోకపోతే ఈనెల 15న బెంగళూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై.విజయేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో రైతులు పడుతున్న కష్టాలు పాలకులకు ఏమాత్రం తెలియకపోవడం వల్లనే, సమస్యలపై అవగాహన లేని మంత్రి నీటి పారుదల సలహా సమితి అధ్యక్షుడిగా కొనసాగుతుండటం వల్ల, ఉమ్మడి బళ్లారి జిల్లాతో పాటు మూడు జిల్లాల పరిధిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెలేలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు.

ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు

రైతుల పాదయాత్రలు, ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు కొనసాగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా కూడా లేదన్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో సాగు చేసిన పంటలు నష్టపోతున్న నేపథ్యంలో రబీ పంటకు మానవతా దృక్పథంతోనైనా నీరు అందించి రెండో పంటను పండించుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సురేష్‌బాబు, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ మోకా, రాయచూరు, కొప్పళ, విజయనగర, బళ్లారి జిల్లాలకు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి శ్రీరాములు నేతృత్వంలో మునిరాబాద్‌లో రైతుల సమావేశం

రబీ సీజన్‌లో రెండవ పంటకు నీరు ఇవ్వకపోతే భారీ ఆందోళనకు సిద్ధం

15న బెంగళూరులో బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర ఆధ్వర్యంలో మీటింగ్‌

తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్లు మార్చడంలో ప్రభుత్వాల వైఫల్యంపై మండిపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement