లాభాలంటూ నమ్మించి రూ.2 కోట్ల దోపిడీ
యశవంతపుర: ఓ అమాయకునికి అధిక లాభాల ఆశ చూపి రూ.2 కోట్లకు ముంచేశారు సైబర్ నేరగాళ్లు. దక్షిణ కన్నడ జిల్లా మంగళూరులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మూడేళ్ల కిందట అంకిత్ అనే వ్యక్తి నుంచి బాధిత వ్యక్తికి వాట్సాప్‌లో సందేశం వచ్చింది. తన ద్వారా ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పాడు. సుమిత్, జైస్వాల్, కుశాగర్ జైన్, అఖిల్ అనే వ్యక్తులను పరిచయం చేశాడు. వీరు విదేశాలలో పెట్టుబడులను పెట్టి సంపన్నులైనట్లు నమ్మించాడు. ఇదంతా ఫోన్ కాల్స్‌లోనే జరిగింది. బాధితుడు అంకిత్ మాటలను నమ్మి అతడు పంపిన క్యూఆర్ కోడ్‌కు మొదట రూ.3500 పంపారు. వెంటనే వెయ్యి రూపాయల లాభం వచ్చిందని చూపించారు. ఇలా నమ్మకం పెంచడంతో బాధితుడు తన ఖాతా నుంచే కాకుండా భార్య, చిన్నాన్న, కోడలు బ్యాంక్ ఖాతాల నుంచి కూడా డబ్బులను బదిలీ చేయసాగాడు. 2022 నుంచి 2025 అగస్ట్ ఆఖరు వరకు యుపిఐ, ఐఎంపీఎస్ ద్వారా రూ.2 కోట్లను బదిలీ చేశాడు. మరింత పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు ఒత్తిడి చేయసాగారు. చివరకు మోసపోయినట్లు తెలుసుకుని సైబర్‌క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కాగా, పోలీసులకు చెబితే హత్య చేస్తామని దుండగులు అతనిని బెదిరించడం గమనార్హం.
డేటింగ్ మత్తులో.. రూ.6.80 లక్షల లూటీ
● బెంగళూరులో ఘరానా యువతి
బనశంకరి: డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువతి.. ఓ వ్యక్తి నుంచి రూ.1.29 కోట్లు వసూలు చేసిన ఘటనను మరువకముందే బెంగళూరులో మరో డేటింగ్ దందా బయటపడింది. యువకున్ని లాడ్జికి తీసుకెళ్లిన యువతి మత్తుమందు ఇచ్చి 58 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదును దోచుకుని ఉడాయించింది. ఈ ఘటన ఇందిరానగర పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడుకు చెందిన అవినాశ్‌కుమార్ పీణ్యా నాగసంద్రలో పీజీ హాస్టల్‌లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం హ్యాపెన్ అనే డేటింగ్ యాప్‌లో కవిప్రియా అనే యువతి అతనికి పరిచయమైంది. ఇద్దరు మొబైల్‌లో మాట్లాడుకునేవారు. ఈ నెల 1న తేదీన ఇందిరానగర రెస్టారెంట్‌లో మందుపార్టీ చేసుకుని, లాడ్జిలో రూంకి వెళ్లారు. తరువాత మంచినీటిలో మత్తుమందు ఇచ్చి తాగించడంతో బాధితుడు స్పృహకోల్పోయాడు. మరుసటిరోజు నిద్రలేచి చూసుకుంటే మెడలో బంగారుచైన్, చేతి ఉంగరం, రూ.10 వేల నగదు కలిపి, మొత్తం రూ.6.80 లక్షల డబ్బు, బంగారం లేవు, యువతి దోచుకుని ఉడాయించిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు.
గతంలోనూ..
కాగా, జూలైలోనూ ఇలాంటి ఘటన జరిగింది. తెలంగాణ కు చెందిన వ్యక్తిని డేటింగ్ పార్టీకి పిలిచి దోచుకున్న కేసులో సంగీతా సహాని, బీర్బల్ మజ్జగి, అభిషేక్, శ్యామ్‌సుందర్‌పాండే, రాజు మానే, శరణబసప్ప బాళిగేర్ ఆనే ఆరుమందిని అరెస్ట్ చేశారు.
మంగళూరువాసికి సైబర్
నేరగాళ్ల శఠగోపం
ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరింపు


