ఏ క్షణమైనా బండి పంక్చర్
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో రద్దీగా ఉండే తుమకూరు రోడ్డులోని నెలమంగలలో గత కొంతకాలంగా సైలెంట్ అయిన పంక్చర్ మాఫియా మళ్లీ చురుగ్గా మారింది. నెలమంగల సమీపంలోని ఫ్లై ఓవర్ వద్ద ఇటీవల బైక్‌లు, కార్లు వంటి వాహనాలు తరచూ పంక్చర్ అవుతున్నాయని వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అర్జెంటు పనుల మీద, విధులకు వెళ్లేవారు బండి పంక్చరై నరకయాతన పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఈ మాఫియాకు ఎక్కువగా బలవుతున్నారు. కొందరు ఆకతాయిలు రోడ్డు మీద మేకులు విసిరి వెళ్లిపోతుంటారు. వాహనం పంక్చరైతే మరమ్మతుకు రూ. 100 నుంచి 200 వరకూ ఖర్చవుతుంది.
మామూలు అవస్థలు కాదు
డబ్బుల సంగతి ఎలా ఉన్నా వాహనదారులు వేగంగా వెళ్తున్నపుడు హఠాత్తుగా ఇలా అయితే బ్యాలెన్స్ తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక కుటుంబంతో వెళ్లే వారు పంక్చర్ అయితే బండిని తోసుకుంటూ వెళ్లలేక బాధపడతారు. కార్లు అక్కడే ఆగి ఇబ్బంది పడడం పరిపాటిగా మారింది. రాత్రివేళ పంచరైతే ఇక మరింత నరకమే.
1.5 కేజీల మేకులు
కర్ణాటక పోర్ట్‌ఫోలియో అనే ఎక్స్ ఖాతాలో పంక్చర్ మాఫియా గురించి హెచ్చరిచారు. ఇబ్బందిపడుతున్న దంపతులు ఫోటోను పోస్టు చేశారు. ఈ రోడ్డులో పెద్ద అయస్కాంతంతో గాలించగా 1.5 కేజీల మేకులు పోగైనట్టు వీడియో పోస్టు చేశారు. దీనిని బట్టి ఏ స్థాయిలో మేకులను పడేస్తున్నారో అర్థమవుతుంది. ఇలాంటి దుండగులను సీసీ కెమెరాల ఆధారంతో కనిపెట్టి పట్టుకోవాలని సిటీ పోలీసులను డిమాండ్ చేశారు. ఈ మార్గంలో గస్తీని పెంచాలని కోరారు.
నెలమంగల ఫ్లై ఓవర్ వద్ద మాఫియా నీడ
వాహనదారులకు ముచ్చెమటలు
ఏ క్షణమైనా బండి పంక్చర్
ఏ క్షణమైనా బండి పంక్చర్


