మళ్లీ బెంగళూరుకు రజనీ
బొమ్మనహళ్ళి: ప్రముఖ నటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ మళ్లీ బెంగళూరుకు వచ్చారు. ఆయన సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్‌కు గుండెపోటు వచ్చి బెంగళూరు శివార్లలో ఆనేకల్ హెబ్బగోడిలో ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించడానికి రజనీకాంత్ మంగళవారం సాయంత్రం వచ్చారు. అది తెలిసి వందలాది మంది అభిమానులు రావడంతో రద్దీ ఏర్పడింది. అభిమానులను నిరాశపర్చకుండా తలైవా కారులో నుంచి చెయ్యి ఊపుతూ వెళ్లారు. రజనీ వెంట భార్య లతా, కుమార్తెలు సౌందర్య , ఐశ్వర్య కూడా ఉన్నారు. ఆస్పత్రికి వెళ్లి సోదరున్ని పరామర్శించడంతో పాటు వైద్యులతో మాట్లాడారు.


