మంగళముఖి పెద్దమనసు
రాయచూరు రూరల్ : ప్రజలు తమ స్వార్థం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం తహతహలాడే సమయంలో ట్రాన్స్‌జెండర్ (మంగళముఖి) స్వంత ఖర్చుతో దర్గాను నిర్మించిన ఘటన కళ్యాణ కర్ణాటక పరిధిలోని కలబుర్గి జిల్లా వాడి పట్టణంలో వెలుగులోకి వచ్చింది. సమాజంలో అప నిందలు, అపహాస్యపు మాటలు పడి, నలుగురిలో చీవాట్లు పెట్టించుకున్న ట్రాన్స్‌జెండర్ శాంతమ్మ ఒకరు. నివసించడానికి తనకున్న స్వంత ఇంటిని విక్రయించి దాంతో వచ్చిన రూ.65 లక్షల సొమ్ముతో దర్గాను నిర్మించారు. చిత్తాపుర తాలూకా హణ్ణికెరె నివాసి శాంతమ్మ ఆర్‌ఎస్‌ఎస్ అభిమాని కావడం విశేషం. ముంబైలో సొంతింటిని అమ్మి గ్రామంలోని కొండపై 15 అడుగుల ఎత్తులో గుమ్మటాన్ని, నాలుగు మినార్‌లతో కూడిన హజరత్ మౌలాలి దర్గాను నిర్మించారు. 5.5 కే.జీ.ల వెండితో గుర్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.
పాతికేళ్ల క్రితం ముంబై నుంచి తిరిగి రాక
25 ఏళ్ల క్రితం ముంబై నుంచి తిరిగి వచ్చిన శాంతమ్మ చిత్తాపుర తాలూకా హణ్ణికెరెలో స్థిర నివాసం ఉండిపోయింది. ఈ నేపథ్యంలో కొండపై ఆలయం, దర్గాను నిర్మించాలని గ్రామస్తుల ముందు చెప్పగా చులకనగా చూసిన వారు ఆమెను అవమానపరిచే విధంగా మాట్లాడారు. అయితే దీన్ని సవాల్‌గా స్వీకరించిన శాంతమ్మ 2023లో దర్గా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2024 మేలో నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. త్వరలో కాళిక, మల్లయ్య దేవాలయాల నిర్మాణానికి అంకురార్పణ చేస్తామని ఆమె తెలిపారు. ప్రతి ఏడాది మొహర్రం పండుగ సమయంలో వచ్చి సంబరాలను తిలకించేవారమన్నారు. హిందూ, ముస్లిం భావైక్యతకు దర్గా సంకేతమని శాంతమ్మ వివరించారు.
రూ.65 లక్షలతో దర్గా నిర్మాణం
కలబుర్గి జిల్లా వాడి పట్టణంలో దాతృత్వం


