లొంగిన నక్సల్‌కు హైకోర్టు బెయిలు
● సర్కారు తీరుపై జడ్జి ఆశ్చర్యం
శివాజీనగర: నక్సలైటుగా ఉండి, లొంగిపోయిన వారికి పునరవాస పథకం కింద పరిహారం ప్రకటించారు, కానీ బెయిల్ ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తంచేసింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన లక్ష్మీ పూజారి అలియాస్ తొంబట్టు లక్ష్మీ నక్సలైటుగా ఉండేది. ఆమె కర్ణాటకలో నక్సల్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనింది. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఫిబ్రవరిలో లొంగిపోయింది, అయితే ఉడుపి జిల్లా పోలీసులు పలు కేసుల్లో నిందితురాలిగా ఉన్న ఆమె అరెస్టుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె బెయిలు మీద శ్రద్ధ పెట్టలేదు. ఉడుపి జిల్లా కోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిలు దక్కలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి వెంకటేశ్ టీ నాయక్.. సర్కారు తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, పిటిషన్‌దారు, మరో ఇద్దరు రూ.50 వేలు వ్యక్తిగత బాండ్ ఇస్తూ, విచారణకు హాజరు కావాలనే షరతులతో బెయిలును మంజూరు చేశారు.
సీఎం పిటిషన్ వాయిదా
దొడ్డబళ్లాపురం: మైసూరులో ముడా ఇళ్లస్థలాల కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడం తెలిసిందే. గతంలో గవర్నర్ చర్యను సవాలు చేస్తూ సీఎం హైకోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసు బుధవారంనాడు హైకోర్టులో విచారణకు రాగా సీఎం తరపు లాయర్ అభ్యర్థన మేరకు జనవరి 8కి వాయిదా వేశారు.
రూ.10 కోట్ల స్థలం స్వాధీనం
బనశంకరి: బెంగళూరు దక్షిణ నగర పాలికె పరిధిలోని ఉత్తరహళ్లి ఉప విభాగం అరెహళ్లిలో 6 వేల చదరపు అడుగుల స్థలంలో అక్రమంగా నిర్మించిన షెడ్ ను బుధవారం పాలికె అధికారులు తొలగించారు. రోడ్డును ఆక్రమించి అనధికారికంగా షెడ్‌ను నిర్మించారని స్థానికులు లోకాయుక్త కు ఫిర్యాదు చేశారు. లోకాయుక్త ఆదేశంతో జేసీబీతో నేలమట్టం చేశారు. ఈ 6 వేల చదరపు అడుగుల స్థలం సుమారు రూ.10 కోట్ల విలువ చేస్తుందని అదికారులు అంచనావేశారు.
2025 తీపి నైవేద్యాల సమర్పణ
మైసూరు: ఇక్కడి పురభవనం ఆవరణలో ఉన్న కష్టభంజన భైరవ జన్మష్టమి వేడుకల్లో 2025 రకాల తీపి పదార్థాలను నైవేద్యం కోసం తయారు చేసి రికార్డు సృష్టించారు. గత 8 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాలక్ష్మి దేవికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు. శ్రీ కృష్ణగిరి పీఠాధిపతి వసంత విజయానందగిరి మహారాజ్ సన్నిధిలో 5 నుంచి 12 వరకు కష్టభంజన భైరవ జన్మాష్టమి సాగింది. రోజూ విశేష భైరవ ఆరాధన, మధ్యాహ్నం కష్టభంజన మహాయజ్ఞం, సాయంత్రం బైరవ మహాపురాణ మహాకథ కార్యక్రమాలు జరిగాయి.
మెట్రో ఎల్లో లైన్‌లో ఇబ్బంది
శివాజీనగర: ఆర్‌వీ రోడ్డు నుంచి బొమ్మసంద్రకు సాగే 18 కిలోమీటర్ల పొడవైన నమ్మ మెట్రో ఎల్లో లైన్‌లో ఓ రైలులో సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆ లైన్‌లో సంచారానికి ఇబ్బంది నెలకొంది. బుధవారం ఉదయం ప్రజలు కార్యాలయం, పనులకు వెళ్లే రద్దీ సమయంలో ఇది జరిగింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు మెట్రో అధికారులు ఎక్స్‌లో తెలిపారు. నమ్మ మెట్రో ఎల్లో లైన్‌లో ఇటీవల ఐదో రైలు సంచారం ఆరంభమైంది. ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు తిరుగుతుంది. ఇటీవల చల్లఘట్ట నుంచి వైట్‌ఫీల్డ్ వరకు పర్పుల్ మార్గంలో రైళ్లు నిలిచిపోయి ప్రయాణికులు కష్టాలు పడ్డారు.
స్కానింగ్ సెంటర్‌లో కామపిశాచి
బనశంకరి: స్కానింగ్ కు వెళ్లిన మహిళను అసభ్యంగా తాకి రేడియాలజిస్ట్ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన బెంగళూరు నగరశివారులోని అనేకల్‌లో జరిగింది. ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో రేడియాలజిస్ట్‌గా పనిచేసే జయకుమార్ నిందితుడు. ఇటీవల మహిళ కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా స్కానింగ్‌కు రాసిచ్చారు. ఆమె భర్తతో కలిసి స్కానింగ్ సెంటర్ కు వెళ్లింది. స్కానింగ్ చేసే నెపంతో మహిళ చేతులు, ప్రైవేటు భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ అడ్డుచెప్పగా దూషించి చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటన ను మహిళ తన మొబైల్‌లో రికార్డు చేసుకుంది. ఆమె ఆనేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది, అయితే పోలీసులు కామాంధుడు జయకుమార్ ను ఇంతవరకు అరెస్ట్‌చేయలేదు. ఊరికే విచారించి పంపించేశారు. బాధితురాలు బెంగళూరు రాజీవ్‌గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కామాంధున్ని శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
బైక్ ప్రమాదంలో
యువకుడు మృతి
దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని విండ్సర్ మ్యానర్ వద్ద మంగళవారం రాత్రి బైక్ ప్రమాదంలో డెహ్రాడూన్‌కు చెందిన యువకుడు మృతిచెందగా, యువతి గాయపడింది. వివరాలు.. బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న డెహ్రాడూన్ నివాసి దీపక్, స్నేహితురాలు రోషిణి అర్ధరాత్రి బైక్‌పై దేవనహళ్లిలోని అపార్ట్‌మెంట్‌కి వెళుతున్నారు. విండ్సర్ మ్యానర్ వద్ద దీపక్ తన బుల్లెట్ బైక్‌ని మెట్ల మీద పోనివ్వడంతో అదుపుతప్పి కిందపడ్డారు. తీవ్రగాయాలై పడిఉన్న ఇద్దరినీ పోలీసులు ఆస్పత్రికి తరలించగా దీపక్ చనిపోయాడు. హైగ్రౌండ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.


