విద్యార్థులకు న్యాయ అవగాహన
కోలారు: నగరంలోని బసవశ్రీ లా కళాశాల ఆధ్వర్యంలో సోమవారం కళాశాలలో లా విద్యార్థులకు న్యాయ అవగాహన సహాయం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఆర్.నటేష్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు బాలల హక్కుల రక్షణ, బాలకార్మిక చట్టాలు, బాల్య వివాహ నిషేధ చట్టం, మోటారు వాహన చట్టం తదితరాల గురించి అవగాహన కల్గించారు. ప్రజలు ప్రభుత్వం నుంచి లభిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రతి పౌరుడు చట్టాల గురించి కనీస పరిజ్ఞానం, అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలన్నారు. న్యాయవాది చౌడరెడ్డి పోక్సో చట్టం గురించి అవగాహన కల్గించారు. పిల్లలపై లైంగిక దౌర్జన్యాలు జరిపితే చట్టాల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయో విద్యార్థులకు వివరించారు. ఎస్‌డీయూ హెచ్‌ఈఆర్ లా కళాశాల ప్రిన్సిపాల్ కౌశిక్, న్యాయవాది చౌడరెడ్డి, ఆర్‌ఐ మంజునాథ్, పీడీఓ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
