గడువు ముగిసినా వీడని పదవీ వ్యామోహం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో గడువు ముగిసిన నగరసభలకు తాత్కాలిక అధికార నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించడంతో కొంత మంది అధికారం కోసం పదవిని అంటిపెట్టుకున్న వైనం చోటు చేసుకుంది. రాయచూరు నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, సభ్యుడు జయన్న సోమవారం కార్యాలయానికి వచ్చి పదవులను అలంకరించి ఆసనాల్లో కూర్చొని విధులు నిర్వహించారు. రాయచూరు నగరసభ కార్యవర్గానికి నవంబర్ 2వ తేదీతో పదవీ కాలం ముగిసినా కుర్చీ కోసం అంటి పెట్టుకుని ఉండడంపై ప్రజలు నివ్వెర పోతున్నారు. రోజు ఎలా వస్తారో అలానే వచ్చి అధికారులను కలిసి విధులు నిర్వర్తించారు. 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు ఏడున్నరేళ్ల పాటు అధికారం చెలాయించినా పదవీ వ్యామోహంతో కుర్చీలను వదలడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
