రెండో పంటకు నీరివ్వాలని కంప్లి బంద్
సాక్షి,బళ్లారి: తుంగభద్ర డ్యాంలో గేట్ల మరమ్మతులు చేయాలనే కారణంతో ఏకంగా లక్షలాది ఎకరాలకు రబీలో నీరు ఇవ్వకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రైతు సంఘం నాయకులు, రైతులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో కంప్లిలో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన బాట పట్టి పట్టణ బంద్ చేపట్టారు. కంప్లిలోని వ్యాపార కేంద్రాలు, సినిమా థియేటర్లు, హోటళ్లు తదితరాలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రబీ సీజన్‌కు నీరు ఇవ్వలేమని మంత్రి శివరాజ్ తంగడిగి ఏ ఉద్దేశ్యంతో చెబుతున్నారు? అని ప్రశ్నించారు. డ్యాంలో రబీ పంట సాగుకు సరిపడేంత నీరు ఉందన్నారు. అంతేకాకుండా డ్యాంలోకి మళ్లీ వర్షాల ద్వారా నీరు వచ్చే సూచనలు ఉన్నాయన్నారు.
రైతులను నట్టేట ముంచే యత్నం
అవగాహన రాహిత్యం, కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతూ రైతులను నట్టేట ముంచాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాంలోని గేట్లు మార్చాలనే ఉద్దేశ్యంతో ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వకపోతే వేలాది మంది రైతన్నలు పొట్టకొడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యాంలోని గేట్లను మరమ్మతు చేయడం మంచిదేనని, అయితే అందుకు తగిన సమయం కూడా ఉందన్నారు. రబీ పంట అయిన తర్వాత నాలుగు నెలల పాటు డ్యాం ఖాళీగా ఉంటుందని, అప్పుడు డ్యాంలో గేట్లు రిపేరీ చేయవచ్చని సంబంధిత నిపుణులు కూడా సూచిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో కనీస అవగాహన లేకుండా రైతులను ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసిన పంటలు చేతికందే పరిస్థితి కనిపించడం లేదన్నారు.
నీరు ఇవ్వలేమని చెప్పడం తగదు
కనీసం రబీలోనైనా పంటలు పండించుకుందామని ఆశిస్తే ముందుగానే నీరు ఇవ్వలేమని చెప్పడం సరికాదన్నారు. రబీ సీజన్‌లో ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాగా ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతుల్లో రోజురోజుకు ఆందోళన పెరిగిపోతోంది. పార్టీలకతీతంగా ప్రభుత్వ తీరును విమర్శిస్తూ రైతులు పోరుబాట పట్టారు. కంప్లి, బళ్లారి, సిరుగుప్ప తదితర ప్రాంతాల్లో రైతులు ఆందోళనలు, ధర్నాలు, బంద్‌లు చేస్తుండటంతో ప్రభుత్వం కదిలి వచ్చి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని ఈ ప్రాంత రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాలకుల తీరుపై రైతు సంఘం
నాయకుల ఆగ్రహం
రబీ సీజన్‌కు నీరివ్వకపోతే ఖబడ్దార్
అంటూ హెచ్చరికలు


