
విపణి వీధులకు దసరా కళ
బనశంకరి: పండుగలలో ముఖ్య పర్వదినమైన దసరా ఆయుధ పూజ సంభ్రమం అంతటా నెలకొంది. నేడు బుధవారం ఆయుధ పూజ కాగా, మంగళవారం మార్కెట్లలో పూలు పండ్లు, మిఠాయిలు, ఇతర పండుగ సామగ్రి కొనుగోళ్లతో కిటకిటలాడాయి. బుధ, గురువారాలు సెలవులు కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పలు ప్రైవేటు సంస్థలు, ఆఫీసుల్లో మంగళవారమే మామిడి, అరటి తోరణాలు, పూల హారాలు కట్టి అలంకరించి పూజలు చేశారు.
అమ్మో ఇంత ధరలా
బెంగళూరులోని కేఆర్.మార్కెట్, మల్లేశ్వరం, యశవంతపుర, గాంధీ బజార్, విజయనగర, ఉళ్లాల మెయిన్ రోడ్డు, మహాలక్ష్మీ లేఔట్, రాజాజీనగర, బనశంకరి, జయనగర, మడివాళ మార్కెట్లలో ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయాయి. అన్ని ధరలనూ పెంచేశారు. గుమ్మడి కాయ ధర రూ.40 నుంచి 60గా ఉంది, చేమంతి మూర రూ.150, చెండుపూలు కిలో రూ.50–60, మల్లెపూలు కిలో రూ.400–800, గులాబీలు రూ.300, కనకాంబరాలు కిలో రూ.1000, సుగంధరాజ రూ.300 ధరలతో విక్రయిస్తున్నారు. పండ్ల ధరలు కూడా మామూలు కంటే ఎక్కువగా ఉన్నాయి.
పండుగ సామగ్రి కొనుగోళ్లతో రద్దీ
రెట్టింపైన పూలు, పండ్ల ధరలు
ఆఫీసుల్లో ముందే ఆయుధ పూజ
విధానసౌధ ముస్తాబు
శివాజీనగర: పరిపాలనా శక్తికేంద్రాలైన విధానసౌధ, వికాససౌధ, బహుళ అంతస్థుల భవనంతో పాటుగా రాష్ట్రమంతటా మంగళవారం ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయుధ పూజను ఆచరించారు. ఉద్యోగులు ఉదయం నుంచే ఆఫీసులను సుందరంగా అలంకరించారు. విధానసౌధలో తమ తమ ఛాంబర్ల ముందు మహిళా సిబ్బంది ముగ్గులు వేసి పూలదండలతో సింగారించారు. సౌధ మొత్తం కొత్త కళ వచ్చింది. పోలీసు స్టేషన్లలో వాహనాలు, ఆయుధాలను శుభ్రం చేసి పూజలు చేశారు. సీఎం, డీసీఎం, మంత్రులు, ప్రతిపక్ష నేతల ఛాంబర్లను ముస్తాబు చేసి పూజలు చేశారు.

విపణి వీధులకు దసరా కళ

విపణి వీధులకు దసరా కళ