
భారీ విస్ఫోటం
యశవంతపుర: హాసన్ జిల్లా పాత ఆలూరులో అనుమానాస్పదమైన పేలుడు జరిగి సుదర్శన్ అచారి (32), భార్య కావ్య (27) గాయపడ్డారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బృహత్ విస్ఫోటం జరిగి ఇంటి గోడ బద్ధలైంది, వంట సామాన్లు చెల్లాచదురుగా పడ్డాయి. పెద్ధ శబ్ధం, ప్రకంపనలు రావడంతో ఏం ప్రమాదం ముంచుకొచ్చిందోనని గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. దంపతులు గాయపడగా, వారి ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు తగిలాయి. పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే కిటికీలు, తలుపులు లేచిపోయాయి. ఇంట్లోని సామగ్రి దూరంగా ఎగిరిపడింది.
బెంగళూరుకు తరలింపు
దంపతులకు ఆలూరు తాలూకా ఆస్పత్రిలో చికిత్స చేసి ఆందోళనకరంగా ఉండడంతో హాసన్‌లోని హిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చివరకు జీరో ట్రాఫిక్ ద్వారా బెంగళూరుకు తరలించారు. పేలుడుకు కారణాలపై తలోమాట ఉంది. గ్యాస్ సిలిండర్ పేలుడా, లేదా ఏవైనా పేలుడు పదార్థాలను నిల్వ చేసి ఉంటే విస్ఫోటం చెందాయా? అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు. హాసన్ జిల్లా ఎస్‌పీతో పాటు ఫోరెన్సిక్ నిపుణులు ఇంటిని పరిశీలించారు. అక్కడ కొన్ని తూటాల వంటి శకలాలు లభించాయి. దీపావళి కోసం టపాసులను తయారు చేయాలని భారీ మొత్తంలో మందుగుండు, ఇతరత్రా విస్ఫోటక వస్తువులను దాచి ఉంచారని కొందరు చెబుతున్నారు.
పేలుడుకు చెల్లాచెదరైన ఇల్లు, వస్తు సామగ్రి (ఇన్‌సెట్) అనుమానిత మందుగుండు
దంపతులకు తీవ్రగాయాలు
హాసన్ జిల్లాలో కలకలం

భారీ విస్ఫోటం