
కంటి శస్త్రచికిత్సలు విజయవంతం
హొసపేటె: నేత్రలక్ష్మిద వైద్యాలయ, అశ్విని కంటి ఆస్పత్రి సంయుక్త సంస్థ బల్డోటా గ్రూప్ ఎంఎస్‌పీఎల్ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుంచి విజయవంతంగా శస్త్రచికిత్సలు జరిగాయి. సోమవారం ఉచిత కంటి శస్త్రచికిత్స శిబిరంలో పాల్గొన్న సంస్థ అధికారి మధుసూదన్ మాట్లాడుతూ విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత మొత్తం 53 మంది లబ్ధిదారులు కంటి చూపును తిరిగి పొందారన్నారు. సామాజిక సేవలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండే బల్డోటా గ్రూప్ సేవా స్పూర్తితో పని చేసే నేత్రలక్ష్మి వైద్యాలయం సహకారంతో ఈ శిబిరాన్ని విజయవంతం చేశామన్నారు.
మైసూరు దసరాకు ప్రేరణ హంపీ
హొసపేటె: ఒక వైపు మైసూరు దసరాను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. మైసూరులో జరిగే దసరాకు ప్రేరణ ప్రపంచ ప్రఖ్యాత హంపీ. ఏటా మైసూరులో జరిగే దసరాను 500 ఏళ్ల క్రితం విజయనగర సామ్రాజ్య రాజులు తొమ్మిది రోజుల పాటు హంపీలో మహానవమి దిబ్బ మీద నిర్వహించేవారు. అదే స్పూర్తితో ప్రస్తుతం మైసూరులో తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను జరుపుతున్నారు. అలాంటి మహానవమి దిబ్బ ఇప్పుడు కేవలం స్మారకంగానే మిగిలి ఉంది. మైసూరు దసరా సందర్భంగా మహానవమి దిబ్బపై కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చాలా మంది కళాకారులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలు పెడచెవిన పెడుతుండటం శోచనీయం.
మహిళ దారుణ హత్య
బళ్లారిఅర్బన్: బళ్లారి జిల్లాలోని సిరుగుప్ప తాలూకా ముద్దటనూరు గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు సిరిగేరి ఎస్‌ఐ తెలిపారు. లింగమ్మ(22) అనే మహిళ రాత్రి నిద్రిస్తుండగా ఆమె భర్త దేవరాజు గొడ్డలితో భార్య గొంతుపై నరికి చంపాడు. ఈ ఘటనపై సిరిగేరి పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ శోభారాణి మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దేవరాజ్, లింగమ్మ దంపతులకు ఐదేళ్ల క్రితం పెళ్లి కాగా ఇంతవరకు సంతానం కాలేదు. పైగా ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తూ భర్త దేవరాజ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులకు మంత్రి పరామర్శ
హొసపేటె: తాలూకాలోని గాదిగనూరులో శనివారం తెల్లవారు జామున వంట సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గాయపడ్డ విషయం తెలిసిందే. మంగళవారం విజయనగర జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షత్రగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు.
కులగణన పూర్తి చేసిన
ఉపాధ్యాయుడికి సన్మానం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సమీక్షలో పాల్గొని వంద శాతం పూర్తి చేసిన ఉపాధ్యాయుడిని జిల్లాధికార యంత్రాంగం సన్మానించిన ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం గ్రామీణ నియోజకవర్గంలోని కట్లటకూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణమూర్తి తన విధులను సమర్థవంతంగా నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. కులగణన సమీక్షలో సర్వర్ సమస్యలున్నా వాటిని లెక్క చేయకుండా సమీక్షను వంద శాతం పూర్తి చేయడంతో జిల్లాధికార యంత్రాంగం తరపున కృష్ణమూర్తిని తహసీల్దార్ సురేష్ వర్మ అభినందించారు. సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు నెట్‌వర్క్ ఇబ్బందులు కలిగించగా తిరిగి మూడు రోజుల్లో 150 ఇళ్ల కులగణన సమీక్షను నిర్వహించారు.

కంటి శస్త్రచికిత్సలు విజయవంతం

కంటి శస్త్రచికిత్సలు విజయవంతం

కంటి శస్త్రచికిత్సలు విజయవంతం

కంటి శస్త్రచికిత్సలు విజయవంతం