
అంగన్‌వాడీలపై వేటు విరమించుకోవాలి
రాయచూరు రూరల్: కులగణన సమీక్షపై నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్‌కు గురైన ఆరుగురు అంగన్‌వాడీ కార్యకర్తలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకాలో గుండమ్మ, రంగమ్మ, ముత్తమ్మ, చాంద్‌బి, విజయలక్ష్మి, రేణుకలను విధుల నుంచి తొలగించారన్నారు. ప్రభుత్వం సమీక్షకు సంబంధించి సౌకర్యాలు కల్పించకుండా విధులు నిర్వహించడం కష్ట సాధ్యమని అధికారులకు వివరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో కార్యకర్తలకు అధిక పని భారం ఉంటుందన్నారు. మానసికంగా అనారోగ్యంతో బాధపడుతూ విధులు నిర్వహించే వారిని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు.
శివాజీ విగ్రహం ఏర్పాటుకు వినతి
రాయచూరు రూరల్: నగరంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయాలని రాయచూరు క్షత్రియ వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు అంబాజీ మాట్లాడారు. రాయచూరు కాస్ బావి వద్ద ఖాళీగా ఉన్న స్థలంలో శివాజీ విగ్రహం ఏర్పాటుకు 2016లో నగరసభ సమావేశంలో తీర్మానం చేశారన్నారు. విగ్రహం ఏర్పాటు చేయాలని కోరుతూ కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు వినతిపత్రం సమర్పించారు.
కులగణనలో ఉపాధ్యాయినికి ప్రమాదం
●స్పందించిన గ్రామీణ శాసన సభ్యుడు
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణన సమీక్షలో పాల్గొన్న ఉపాధ్యాయురాలికి ప్రమాదం సంభవించిన ఘటన కలబుర్గి జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం గ్రామీణ నియోజకవర్గంలో కులగణన సర్వేకు వెళుతున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో చిన్న పిల్లవాడితో పాటు పడి గాయపడ్డారు. అక్కడే ఉన్న గ్రామీణ శాసన సభ్యుడు బసవరాజ్ ముత్తిమోడ్ వారిద్దరిని తన వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తొందరపాటు వల్ల ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తాయన్నారు. అధికారుల ఒత్తిడితో ప్రమాదాలు సంభవించడంపై ప్రజలు శాపనార్థాలు పెడుతున్నారు.
కృష్ణమ్మ పరవళ్లు.. ఆందోళనలో తీర ప్రాంత రైతులు
రాయచూరు రూరల్: ఎగువన మహారాష్ట్రలో అధికంగా వానలు కురుస్తుండడంతో ఉత్తర కర్ణాటకలోని నదీ తీర జిల్లాల్లో కృష్ణా నదికి వరద పోటెత్తింది. ఆయా జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్యాణ కర్ణాటకలోని కలబుర్గి, యాదగిరి, రాయచూరు జిల్లాల్లో భీమా, కృష్ణా నదీ తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కృష్ణా నదికి 4,26,604 క్యూసెక్కుల నీరు వదిలారు. దీంతో లింగసూగూరు తాలూకా శీలహళ్లి వంతెనను తాకుతూ వరద నీరు ప్రవహిస్తున్నాయి. రైతులు రాయచూరు తాలూకాలోని నదీ తీర ప్రాంతంలో అమర్చిన పంప్‌సెట్లను స్వచ్ఛందంగా తొలగించుకుంటున్నారు.
నేహా కేసులో సాక్షుల విచారణ
హుబ్లీ: విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు విచారణ 1వ జిల్లా సెషన్స్ కోర్టులో శనివారం ప్రారంభం కాగా సోమవారం నలుగురు సాక్షులను విచారించారు. ఆ తర్వాత కేసు విచారణ వాయిదా వేశారు. ఈ నెల 30న కూడా 5 మంది సాక్షుల విచారణ జరగనుంది. శనివారం ఇద్దరు సాక్షులను విచారించారు. 2024 ఏప్రిల్ 18న విద్యార్థిని నేహా హిరేమఠను బీవీబీ కళాశాల క్యాంపస్‌లో ఫయాజ్ అనే యువకుడు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
యువకుడు ఆత్మహత్య
హుబ్లీ: మరో ఘటనలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ధార్వాడ తాలూకా నరేంద్ర గ్రామంలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మైలారగౌడ బసన్నగౌడ పాటిల్(36)ను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువకుడిగా గుర్తించారు. కొన్ని రోజుల క్రితం నుంచి కడుపునొప్పితో బాధ పడుతున్న ఇతడు రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోతుండగా ఉరి వేసుకొన్నాడు. ఈ ఘటనపై ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

అంగన్‌వాడీలపై వేటు విరమించుకోవాలి

అంగన్‌వాడీలపై వేటు విరమించుకోవాలి