
అడ్డదారి కబ్జాపై మంత్రికి ఫిర్యాదు
బళ్లారిఅర్బన్: మూడు దశాబ్దాలుగా బడాబాబులు తమ స్వార్థ శక్తుల పలుకుబడితో వేలాది మందికి రహదారిగా ఉన్న మార్గంలో వెళ్లడానికి విలువైన స్థలాన్ని నిట్టనిలువునా దోచుకున్నారని, ఇప్పటికై నా ఆ స్థలానికి విముక్తి కల్పించి సామాన్య ప్రజలకు బాటగా మార్చాలని సామాజిక పోరాట యోధుడు సిద్దేశ్ హూళూరు, ఉప్పార సంఘం ప్రముఖ నేత, సీనియర్ సిటిజన్ సీ.మల్లప్ప డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన జనతాదర్శన్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ వద్దనున్న అన్ని రికార్డులను ముఖ్యంగా 30 ఏళ్లుగా అక్కడి స్థానికులు స్థలం గురించి చేస్తున్న పోరాటం తీరుతెన్నులను వినతిపత్రం రూపంలో వివరించారు. రాజ్‌కుమార్ 18వ వార్డు పటేల్ నగర్ గురుకృప కాలనీలో ఆ దారిని అక్రమంగా అక్రమించుకొని ఇటుకలతో మూసి వేశారు. సమస్యపై జిల్లా ఫోరం, కర్ణాటక హైకోర్టుతో పాటు బళ్లారి బుడా సంస్థ తమకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశ పత్రాల వివరాలను కూడా వారు మంత్రికి సమగ్రంగా వివరించారు. కర్ణాటక హైకోర్టు కూడా సదరు సమస్యను సానుకూలంగా పరిశీలించి కేవలం ఒకరిద్దరు తమ స్వార్థం కోసం ఆర్‌ఆర్ థియేటర్ హద్దినగుండు రోడ్డుకు వెళ్లి ఈ ప్రజల ఆస్తిలో సామాన్య ప్రజలకు సంచరించడానికి వీలు లేకుండా అడ్డుగోడ కట్టారని వారు వాపోయారు. బళ్లారి సిటీ కార్పొరేషన్, బళ్లారి నగరాభివృద్ధి సంస్థ కూడా సానుకూలమైన ఆదేశాలు ఇచ్చినా అక్రమార్కులు మాత్రం తమ పలుకుబడితో మాయ చేస్తూ అందరిని మభ్యపెట్టి తమదైన రాజ్యాంగం అమలు చేస్తూ సదరు అడ్డదారి రోడ్డును వారు తమ సొంతానికి వాడుకుంటూ సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని సిద్దేశ్ హూళూరు, సీ.మల్లప్ప ఆరోపించారు. ఇప్పటికై నా ఈ రహదారిని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచి రాకపోకలు సాగించడానికి వీలు కల్పించాలని వారు ఆ వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు.
ఆక్రమణలు తొలగించి ప్రజలకు దారి కల్పించాలని వేడుకోలు