
ఇంత వరద నష్టం జరిగిందా!
శివాజీనగర/ రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో వరద పీడిత జిల్లాల్లో సీఎం సిద్దరామయ్య మంగళవారం గగన సమీక్ష జరిపారు. బెంగళూరు నుంచి మంగళవారం ఉదయం కల్బుర్గికి ప్రత్యేక విమానంలో చేరుకొన్న ముఖ్యమంత్రి అక్కడి విమానాశ్రయం నుంచి హైలికాప్టర్ ఎక్కి వరద పీడిత ప్రాంతాలకు వెళ్లారు. నీట మునిగిన పొలాలు, ఊళ్లను వీక్షించారు. సుమారు 2 గంటలకు పైగా సాగింది. సీఎంతో పాటు జిల్లా మంత్రి ప్రియాంక ఖర్గే, మరికొందరు మంత్రులు ఉన్నారు. కల్బుర్గి, బీదర్, యాదగిరి జిల్లాల్లో ఏరియల్ వ్యూ నిర్వహించారు.
సహాయక చర్యలపై చర్చ
తరువాత సీఎం, మంత్రులు కల్బుర్గిలో దిగి అధికారులతో సమావేశమయ్యారు. కల్బుర్గి, బీదర్, విజయపుర, యాదగిరి జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద పరిస్థితిని ఎదుర్కోవాలని, బాధితులకు సత్వర సాయం చేయాలని సీఎం ఆదేశించారు. ఎలాంటి ప్రాణ హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంటలు, ఇళ్లు కోల్పోయిన బాధితులకు తక్షణమే పరిహార సొమ్మును విడుదల చేయాలన్నారు.
అతివృష్టికి తోడు ఎగువన మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, భీమా, ఇతర నదులు ఉప్పొంగడంతో కలబుర్గి, యాదగిరి, బీదర్, రాయచూరు, విజయపుర జిల్లాల్లో ఊళ్లు, పొలాలు నీట మునిగాయని సీఎం తెలిపారు. జిల్లాధికారుల ఖాతాల్లో రూ.1,354 కోట్ల నిధులను వాడుకోవడానికి అవకాశం క ల్పించామన్నారు. 75 చోట్ల గంజి కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయస్వామి కలబుర్గిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి రైతుల పంట పొలాల్లో కుళ్లిన కంది పంటను పరిశీలించారు. ఈ జిల్లాల్లో 8.60 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేశారు.

ఇంత వరద నష్టం జరిగిందా!

ఇంత వరద నష్టం జరిగిందా!