
ఇద్దరు శ్రీలంక పౌరులు అరెస్ట్
యశవంతపుర: బెంగళూరులో అక్రమంగా నివాసం ఉన్న ముగ్గురు శ్రీలంక పౌరులను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. దేవనహళ్లి సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు చేపట్టారు. విదేశీ చట్టం కింది కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. బెంగళూరులో ఎందుకు నివాసం ఉంటున్నారనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. పాస్‌పోర్టు, వీసా లేకూండా 2024లో జాప్నా నుంచి బోటులో తమిళనాడు రామేశ్వరానికి శ్రీలకం పౌరులు వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరుకు చేరుకుని.. దేవనహళ్లి సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విదేశీ పౌరులకు బాడుగ ఇళ్లు ఇవ్వాలంటే బాడిగ ఇంటి యజమాని పోలీసులకు సీ ఫారం ఇవ్వాలనే నిబంధన తప్పనిసరిగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
కంటైనర్ పల్టీ
దొడ్డబళ్లాపురం: అదుపు తప్పిన కంటెయినర్ వాహనం రహదారిపై పల్టీ కొట్టిన సంఘటన నెలమంగల టోల్ వద్ద చోటుచేసుకుంది. తుమకూరు నుంచి బెంగళూరు వస్తున్న కంటెయినర్ ఒకటి నెలమంగల టోల్ వద్ద హఠాత్తుగా అదుపుతప్పింది. రోడ్డుపై అడ్డంగా బోల్తా పడింది. గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టోల్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రేన్‌ల సాయంతో కంటెయినర్‌ను రోడ్డు పక్కకు తొలగించారు. కంటెయినర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
పోలీసులకు ఆరోగ్య శిబిరం
యశవంతపుర: బెంగళూరు నగరంలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులకు అరోగ్య శిబిరం నిర్వహించారు. నగర పోలీసు కమిషనర్ సీమంత కుమార్ సింగ్ నేతృత్వంలో ఉప పోలీసు కమిషనర్ల సహకారంతో ఒక వారం వ్యవధిలో మానసిక అరోగ్య శిబిరం నిర్వహించారు. మానసిక అరోగ్య సమస్యలు, ఆత్మహత్యల నివారణపై వైద్యులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో 100 మంది అధికారులు, సిబ్బంది పాల్లొన్నారు.
నవదుర్గ నృత్య రూపకం
గౌరిబిదనూరు: ఆదివారం రాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నగరంలో శారదామాత ఆలయంలో నాట్యాలయ విద్యార్థుల నవదుర్గా భరతనాట్య రూపకం భక్తులను ఆకటుకుంది. దుర్గామాత గొప్పతనాన్ని నృత్యం ద్వారా మనోహరంగా చాటిచెప్పారు.
గ్రామ చెరువులోకి
భైరప్ప చితాభస్మం
దొడ్డబళ్లాపురం: ప్రముఖ రచయిత, పద్మభూషణ్ ఎస్‌ఎల్ భైరప్ప చితాభస్మాన్ని ఆయన స్వగ్రామం చెన్నపట్టణ తాలూకా సంతేశివర చెరువులో కలిపారు. సోమవారంనాడు ఆయన కుమారులు రవిశంకర్, ఉదయ్‌లు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సీఎన్ బాలక్రిష్ణ, మాజీ ఎమ్మెల్సీ గోపాలస్వామి, వందలాది మంది గ్రామస్తులు హాజరయ్యారు.
హాస్యనటుడు యశ్వంత్ మృతి
యశవంతపుర: రంగస్థల కళాకారుడు, కన్నడ సినిమా రంగంలో హాస్యనటుడిగా గుర్తింపు పొందిన యశ్వంత్ సరదేశ పాండె (62) గుండెపోటుతో కన్ను మూశారు. బెంగళూరు బన్నేరఘట్ట సమీపంలోని ఫోటీస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించిన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కన్నడ సూపర్ హిట్ సినిమా రామ శామ భామ సినిమాలో నటించడంతో యశ్వంత్‌కు గుర్తింపు వచ్చింది. గస్థలంలో మంచి నాటకాలకు దర్శకత్వం వహించారు. ఈయన విజయపుర జిల్లా బసవన బాగేవాడి తాలూకా ఉక్కలి గ్రామానికి చెందిన వారు. ఆల్ ది బెస్ట్ నాటకాన్ని అయనే రచించి, దర్శకత్వం వహించి అందులో నటించి మంచి పేరు సంపాదించారు. ఈయనకు భార్య మాలతి, పిల్లలు ఉన్నారు.
శారదా మాతగా దర్శనం
తుమకూరు: తుమకూరు జిల్లా పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న దసరా వేడుకల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మండపంలో చాముండేశ్వరి దేవిని సోమవారం శారదా దేవి రూపంలో అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే టీబీ జయచంద్ర, భార్య నిర్మల, జడ్పీ సీఈఓ ప్రభు, నాగన్న తదితరులు దర్శించుకుని పూజలు చేశారు.

ఇద్దరు శ్రీలంక పౌరులు అరెస్ట్

ఇద్దరు శ్రీలంక పౌరులు అరెస్ట్

ఇద్దరు శ్రీలంక పౌరులు అరెస్ట్