
నగదు దొంగ అరెస్ట్
చిక్కబళ్లాపురం: నగదు చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఈనెల 23వ తేదీన నగరంలోని బీబీ రోడ్డులో ఉన్న శనేశ్వర స్వామి ఆలయంలో తాలూకా పరిధిలోని దిబ్బూరు గ్రామానికి చెందిన మునిరాజు దేవుడి దర్శనానికి వెళ్లాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి మునిరాజు జేబులో నుంచి రూ.50 వేలు చోరీ చేశాడు. బాధితుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒడిషాకు చెందిన దాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. నగదు తానే చోరీ చేసినట్లు దాస్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అనంతరం అతడి నుంచి రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ మంజునాథ్, పీఎస్‌ఐ రత్నాబాయి ఇతర సిబ్బందిని జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సె అభినందించారు.
ఉచిత ఆరోగ్య శిబిరాలను వినియోగించుకోండి
గౌరిబిదనూరు: గ్రామీణ ప్రదేశాల్లో వివిధ సంస్థలు నిర్వహించే ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తాలూకా వైద్యాధికారి హేమలత పిలుపునిచ్చారు. సోమవారం నక్కలపల్లి పీహెచ్‌సీలో ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య పరీక్షా శిబిరం నిర్వహించారు. రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ క్యాన్సర్ తదితరుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థలోని జ్ఞానవికాస కార్యక్రమాల గురించి ప్రాజెక్ట్ అధికారి నాగరాజ నాయక్ తెలిపారు. కార్యక్రమంలో అశ్విని, సుధ, తదితరులు పాల్గొన్నారు.
రక్తదానంతో ప్రాణదానం
బొమ్మనహళ్లి: అన్నిదానాల్లోకి రక్తదానం చాలా గొప్పదని, ఒకరు రక్తదానం చేయడం ద్వారా ప్రమాదాలలో గాయపడిన, ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న సుమారు ఐదుమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఇందుకోసం యువతతో పాటు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని బొమ్మనహళ్ళి ఎమ్మెల్యే.ఎం.సతీష్‌రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సాయిబాబా ఆలయ ఆవరణలో ఉచిత ఆరోగ్య శిబిరం, రక్తదాన శిబిరాలను ఆయన ప్రారంభించారు. సమారు 70 మందికి పైగా యువకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.
విద్యతోనే ఉన్నతస్థాయికి
గౌరిబిదనూరు: శ్రీకృష్ణుడు గొప్ప తత్వజ్ఞాని, దార్శనికుడని, ఆయన ఆదర్శాలు ఆచరణయోగ్యమని ఎమ్మెల్యే పుట్టస్వామిగౌడ అన్నారు. హెచ్‌ఎన్ కళాభవనంలో యాదవ సంఘంచే ఆదివారం సాయంకాలం జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రారంభించి ప్రసంగించారు. మీ పిల్లలను విద్యావంతులు చేయండి, చదువుద్వారానే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి, బీపి కృష్ణమూర్తి, దొడ్డబళ్ళాపురం ఎమ్మెల్యే ధీరజ్ మునిరాజు, ఆ వర్గం ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిభావంత విద్యార్థులను సన్మానించారు.
ప్రైవేట్ ప్రాణి పాలన కేంద్రంపై దాడి
యశవంతపుర: ఉడుపి జిల్లా బ్రహ్మవర తాలూకా సాలుగ్రామంలో అనధీకృతంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ ప్రాణిపాలనా కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న అనేక జంతువులను రక్షించారు. పేటా ఇండియా సంస్థ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ దాడులు చేశారు. గతంలోనూ ఇలానే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు చేపట్టారు. మళ్లీ నిర్వహకులు అనధీకృతంగా కుక్కలను పెంచుతుండటంతో నిర్వహకుడు సుదీంద్ర ఐతాళను అధికారులు హెచ్చరించి పంపారు. అక్కడ దొరికిన కుక్కలను సురక్షితమైన చోట వదిలినట్లు అధికారులు తెలిపారు. కుక్కలతో పాటు పిల్లులను రక్షించారు.

నగదు దొంగ అరెస్ట్

నగదు దొంగ అరెస్ట్

నగదు దొంగ అరెస్ట్