
యరగేర మాజీ అధ్యక్షుడికి డాక్టరేట్
రాయచూరు రూరల్: రాయచూరు తాలుకా యరగేర గ్రామ పంచాయతీ మాజీ అధ్యక్షుడు నిజాముద్దీన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. శనివారం రాత్రి న్యూఢిల్లీలోని అమెరికా విజ్‌డం పీస్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ల ప్రదానోత్సవం నిర్వహించారు. సమాజ సేవకు గాను అమెరికా విజ్‌డం పీస్ యూనివర్సిటీ ఉపాధ్యక్షుడు డాక్టర్ కృష్ణమూర్తి చేతుల మీదుగా నిజాముద్దీన్ డాక్టరేట్ అందుకున్నారు. కార్యక్రమంలో బసవరాజ్, లక్ష్మీపతి, విద్యానంద రెడ్డి, మారుతి, జగదీష్ రెడ్డి, మహ్మద్ రఫీ, అజీముద్దీన్, ఉమర్ సాబ్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మహాలయ అమవాస్య పూజలు
రాయచూరు రూరల్: జిల్లాలో ఆదివారం మహాలయ అమవాస్య పూజలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. నగరంలోని కిల్లే బృహన్మఠంలో గురు పాదేశ్వరుడి ప్రతిమకు శాంత మల్ల శివాచార్యలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు పాదేశ్వరుడి విగ్రహాన్ని పూలతో అలంకరించారు. సోమవారం నుంచి శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజలు చేస్తామని తెలిపారు.
ఉజ్వల భవిష్యత్తుకు
బాటలు వేయాలి
రాయచూరు రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బాటలు వేయాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పండిత సిద్ధరామజం బలదిన్ని రంగ మందిరంలో ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. ఉపాధ్యాయులు పిల్లల సంక్షేమ కోసం పాటుపడాలన్నారు. ప్రతిభకు తార్కాణంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు. నాణ్యమైన విద్యాబోధన అందించాలని తెలిపారు. కార్యక్రమంలో కిల్లే బ్రహన్మఠాధిపతి శాంత మల్ల శివాచార్యులు, నగర సభ అధ్యక్షురాలు నరసమ్మ, సుఖాణి, రాజా శ్రీనివాస తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
రాయచూరు రూరల్: విష ద్రావకం సేవించి ముగ్గురు యువతులు అత్మహత్యాయత్నం చేశారు. వీరిలో దేవదుర్గ తాలుకాకు చెందిన కె.ఇరబగేర రేణుకమ్మ మృతి చెందింది. మిగతా ఇద్దరు సునీత, ముదుకమ్మ చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. సర్కార్ నుంచి సాయంఅందేలా చూస్తామని హమీ ఇచ్చారు.
కుల గణనలో
నాయక అని రాయించాలి
బళ్లారి అర్బన్: సోమవారం నుంచి ప్రారంభం కానున్న కులగణన సర్వేలో వాల్మీకి కులస్తులందరూ మతం కాలంలో హిందువు అలాగే కులం కాలంలో నాయక అని రాయించాలని జిల్లా వాల్మీకి నాయకర విద్యాభివృద్ధి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.జయరాం పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన సంఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాజనహళ్లి మన కులగురువు సూచన మేరకు మన వాల్మీకి నాయక కులబాంధువులు ఆర్థిక విద్య, సామాజికంగా అభ్యన్నతి సాధించడానికి దోహదపడేలా సదరు కుల గణన సర్వేలో నాయక అని రాయించాలని కోరారు. వాల్మీకులకు ఎటువంటి అన్యాయం జరిగినా అందరూ కలిసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రముఖులు గౌరయ్య, రుద్రప్ప, జి.రుద్రప్ప, గోపాల్, గుజ్జల గాదిలింగప్ప, కాయిపల్లే బసవరాజ్ పాల్గొన్నారు.

యరగేర మాజీ అధ్యక్షుడికి డాక్టరేట్

యరగేర మాజీ అధ్యక్షుడికి డాక్టరేట్

యరగేర మాజీ అధ్యక్షుడికి డాక్టరేట్

యరగేర మాజీ అధ్యక్షుడికి డాక్టరేట్