
సెల్ఫీ తీసుకుంటూ లోయలోకి..
యశవంతపుర: మొబైల్‌ఫోన్ చేతిలో ఉంటే ఫోటోలు, సె ల్ఫీలు తీసుకుంటూనే ఉంటారు. దాని వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అదే మాదిరిగా చిక్కమగళూరు జిల్లా కెమ్మణ్ణగుండిలో వ్యూ పాయింట్ వద్ద భార్యతో కలిసి సెల్పీ తీసుకుంటూ లోయలోకి పడిపోయాడో ఉపాధ్యాయుడు. ఈ ఘటన శనివారం జరిగింది.
మొబైల్ జారిపడిందని..
వివరాలు.. శివమొగ్గ జిల్లా శికారిపురకు చెందిన ప్రభుత్వ టీచర్ సంతోష్, చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా లక్ష్మీసాగర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. భార్య శ్వేతతో కలిసి కెమ్మణ్ణగుండి టూర్‌కి వెళ్లారు. అక్కడ కొండ శిఖరం వద్ద ఇద్దరూ మొబైల్‌తో సెల్ఫీ తీసుకుంటున్నారు. మొబైల్ చేజారటంతో సంతోష్ కంగారుపడ్డాడు, దీంతో అతడు జారి వందల అడుగుల లోయలోకి పడిపోయాడు. తలకు బండరాయి తగిలి బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, వీరిద్దరికీ ఐదేళ్ల క్రితం పెళ్లయింది. దసరా సెలవులు రావడంతో విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. పోలీసులు, ఫైర్ సిబ్బంది లోయలోకి దిగి మృతదేహాన్ని తీసుకొచ్చారు. కళ్లముందే భర్త మరణంతో భార్య కన్నీరుమున్నీరైంది.
భార్య కళ్లముందే భర్త మృతి