
వేధిస్తున్న వీధి పశువుల బెడద
సాక్షి, బళ్లారి: నగరంలో మూగ జీవాల సంచారం అధికమైంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ తిష్ట వేస్తున్నాయి. కొందరు పశువుల యజమానులు వాటిని తమ ఇంటి వద్ద ఉంచుకోకపోవడంతో పాటు వాటికి గడ్డి, మేత వేయకుండా రోడ్లపైకి వదిలేస్తున్నారు. సాధారణంగా పల్లెటూర్లలో అయితే పలాన పశువు పలాన వ్యక్తికి చెందినదని గుర్తు పట్టేందుకు వీలవుతుంది. పల్లెటూర్లలో వీధి పశువులు తిరిగితే లేదా ఎవరైనా ఇతర రైతుల పొలాల్లోకి వెళితే వాటిని పట్టుకుని సంబంధిత పశువుల యజమాని ఇంటికి వెళ్లి మందలిస్తారు. మళ్లీ పొలాల్లోకి వస్తే జాగ్రత్త సుమా అని హెచ్చరించి వస్తుండటంతో పల్లెటూర్లలో వీధి పశువుల బెడద నియంత్రణలో ఉంటుంది. అయితే పెద్ద పెద్ద నగరాల్లో రోడ్ల మీదకు వచ్చే పశువులు ఎవరివన్నది ఎవరికీ తెలియడం లేదు. దీంతో పాటు మహానగర పాలికె అధికారులు, పాలకులు కూడా వీధి పశువులను కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏటేటా రోడ్లలో పదుల సంఖ్యలో కాదు వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి.
రోడ్లపైనే సంచారం
నగరంలోని 39 వార్డులతో పాటు ప్రధాన రహదారుల్లో కూడా నిత్యం వీధి పశువులు రోడ్లలో సంచరిస్తూ అక్కడే పడుకోవడం చేస్తుంటాయి. వీధి పశువులకు బజారులో హోటల్ యజమానులు పడేసే మిగిలి పోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, పేపర్లు, ఇంకా నగరంలోని పశువులపై ఉన్న భక్తితో వారు తమ ఇంటి వద్దకు వస్తే బియ్యం లేదా సద్ది అన్నం, ఇతరత్ర వాటిని ఆహారంగా ఇవ్వడంతో వాటిని తింటూ జీవిస్తున్నాయి. వీటికి యజమానులు ఎవరో ఎవరికీ తెలియదు. కొన్ని పశువులు ఆయా ఇంటి యజమానుల దగ్గరకు వెళ్లి అలా వచ్చి రోడ్లపై సంచరిస్తుంటాయి. కొందరు పశువుల యజమానులు వీధుల్లోకి తమ పశువులను వదిలి ఎవరికీ తెలియకుండా వాటిపై ఒక కన్ను పెడుతూ నిత్యం పర్యవేక్షణ చేసుకుంటూ వాటిని వీధుల్లోనే పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. పెద్దవి అయిన తర్వాత వాటిని కసాయిఖానాకు అమ్మేసేవారు కూడా కొందరున్నారు. ఏది ఏమైనా ఇంటి వద్ద పశువులను పెంచితే వాటికి ఆహారం(గడ్డి, మేత) అందించేందుకు కష్టమవుతోందని సులభంగా పశువులు పెరిగే విధంగా వీధుల్లోకి వదిలి యజమానులు పెంచుకుంటుండటంతో నగర ప్రజలకు శాపంగా మారింది.
పశువులపై దూసుకెళ్తున్న వాహనాలు
రోడ్లలో పశువులు విచ్చల విడిగా తిరుగుతుండటంతో ఒక్కొక్కసారి అదుపు తప్పిన వాహనాలు పశువుల పైకి దూసుకెళ్లడంతో మూగ జీవాలు కాళ్లు విరిగిపోయి అవి రక్తం కారుస్తూ చేసే రోదనలు చూడటం ఎవరి తరం కాకున్న సందర్భాలు కోకొల్లలు. ఓ వైపు రోడ్లలో పశువులపైకి వాహనాలు దూసుకెళ్లి అవి ప్రమాదాలకు గురవుతుంటే మరో సందర్భంలో పశువులు వాహనాలకు అడ్డంగా రావడంతో నియంత్రణ తప్పి ద్విచక్రవాహనదారులు ఎన్నో సార్లు కిందపడి ప్రమాదాలకు గురవుతున్నారు. వీధి పశువుల యజమానులు స్వార్థంతో, నిర్లక్ష్యంతో పశువులను వీధుల్లోకి వదలడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధి పశువుల యజమానులు నిర్లక్ష్యం ఓ వైపు ఉంటే నగరంలో వీధి పశువులను రోడ్లపై తిరిగినప్పుడు వాటికి అడ్డుకట్ట వేయాల్సిన మహానగర పాలికె అధికారులు, పాలకులు మరింత నిర్లక్ష్యంగా, అలసత్వంగా, బాధ్యతారహితంగా పని చేస్తుండటంతో మూగ పశువులు ప్రమాదాలకు గురవుతున్నాయి. పాదచారులు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారికి, ఇతర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి.
కూరగాయల మార్కెట్లో సంచరిస్తున్న పశువులు
రోడ్లపై పోట్లాడుతున్న వీధి పశువులు
ఏళ్ల తరబడి సమస్యను
పట్టించుకోని పాలకులు
పశువుల అడ్డంగా రావడంతో
చోటుచేసుకుంటున్న ప్రమాదాలు
ఏటేటా పెరుగుతున్న పశువుల సంఖ్య
ఏటేటా రోడ్లలో వీధి పశువుల సంఖ్య పెరిగిపోతోంది. నగర ప్రధాన రహదారులు వీధి పశువులకు అడ్డాగా మారిపోతున్నాయి. యజమానుల ఇంటి వద్ద ఉండాల్సిన పశువులకు వీధులు, రోడ్లే వాటికి పశువుల పాకగా మారాయి. దీంతో నగర వాసులకు రోజు రోజుకు ఇబ్బందిగా పరిణమిస్తోంది. మహానగర పాలికె కమిషనర్, సంబంధిత అధికారులు, పాలకులు, చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పాటు వీధి పశువులను ఒక చోట చేర్చి యజమానులు రాకపోతే ఆయా వీధి పశువులను గోశాలలకు తరలిస్తామని హెచ్చరికలు జారీ చేయకపోవడంతో వీధి పశువుల సమస్య జటిలమవుతోందని సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాము మహానగర పాలికె అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా పట్టించుకుంటున్నారే కానీ పూర్తి స్థాయిలో కట్టదిట్టమైన చర్యలు చేపట్టి వీధి పశువులను రోడ్లలో తిరగకుండా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వేధిస్తున్న వీధి పశువుల బెడద

వేధిస్తున్న వీధి పశువుల బెడద