
కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్రలు
బళ్లారి టౌన్: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇటీవల జాతి సమీక్ష పేరుతో కులాల్లో చిచ్చు పెట్టే కుతంత్రాలు చేస్తున్నారని బీజేపీ నేత, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని వాజ్‌పేయి లేఅవుట్‌లోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మిషనరీల ఒత్తిడితో ఈ జాతి సమీక్ష కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ సమీక్షకు సంబంధించిన 1,400 జాతుల పట్టికను వెల్లడించిందని.. అయితే ఈ పట్టిలో అనాధికృత క్రైస్తవ జాతులను చేర్పించిందన్నారు. సమాజంలో వివిధ జాతుల్లో చిచ్చు పెట్టే ధోరణిని ముఖ్యమంత్రి మానుకోవాలని హితవు పలికారు. ఈనెల 22 నుంచి చేపడుతున్న దోషపూరిత జాతుల పట్టికలను సరి చేయాలన్నారు. 12 శతాబ్దంలో బసవన్న మానవ కులమంతా ఒకటి కావాలని కనకదాసులు కూడా కొట్లడుకోరాదని వారి వచనాల్లో చెప్పారన్నారు. బసవన్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నడుచుకుంటుందని దుయ్యబట్టారు. జిల్లాలో తాను మంత్రిగా ఉన్నప్పుడు చాగనూరు వద్ద అంతర్జాతీయ విమాన నిర్మాణానికి ఆనాడు భూములను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలోనే విమానాశ్రయం నిర్మించడం మంచిదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లాధ్యక్షుడు అనిల్ కుమార్, నేతలు కేఎస్ దివాకర్, గుర్రం వెంకటరమణ, కేఏ రామలింగప్ప, గురులింగన గౌడ, రామచంద్రప్ప పాల్గొన్నారు.