
ఏ కులమో చెప్పాలంతే..
శివాజీనగర: పలు సముదాయాల వ్యతిరేకత, సొంత మంత్రుల అసంతృప్తుల మధ్య నేడు సోమవారం నుంచి రాష్ట్రంలో మరో దఫా సామాజిక, విద్యా, ఆర్థిక సమీక్ష (కుల గణన) ఆరంభం కానున్నది. రాష్ట్ర వెనుకబడిన వర్గాల శాశ్వత కమిషన్ రాష్ట్రంలో 7 కోట్ల మంది వివరాలను గణన సిబ్బంది నమోదు చేస్తారు. అక్టోబరు 7 వరకు ఈ సర్వే కొనసాగుతుంది. సర్వే కోసం 1.75 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను నియమించారు. ప్రతి ఇంటిలోనివారిని 60 ప్రశ్నలను అడిగి, ఆ సమాచారాన్ని ఫారంలో నమోదు చేయాలి. రాష్ట్రంలో కులగణను చేయడం ఇది రెండవసారి. కొన్నినెలల కిందట వెలువరించిన కులగణనపై ప్రముఖ కుల సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో సిద్దరామయ్య సర్కారు మళ్లీ ఇప్పుడు సర్వేకు శ్రీకారం చుట్టింది.
ప్రతి ఇంటికీ వెళ్లాలి
ఏ ఇంటినీ వదలకుండా గణనను పూర్తి చేయాలని సర్కారు పట్టుదలతో ఉంది. ఈ బృహత్ కార్యంలో మీటర్ రీడర్ల సహకారం తీసుకుంటోంది. వారి సహాయంతో టీచర్లు ప్రతి ఇంటికీ వెళతారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరి కులం, వివరాలను ప్రత్యేక కాలమ్స్‌లో రాయాలి. సర్వే చేసే ఇంటికి జియో ట్యాగ్ స్టిక్కర్‌లను అతికించి నంబరును కేటాయిస్తారు. క్రైస్తవ కులాల నమోదు వివాదం రేకెత్తిస్తోంది. లింగాయత క్రిస్టియన్, ఒక్కలిగ క్రిస్టియన్, ఫలానా క్రిస్టియన్.. ఇలా గతంలో ఏ కులానికి చెందినవారో దానికి నమోదు చేయాలి. మతమార్పిడి చేసుకున్నా కూడా హిందూ మూల కులాన్ని చేర్చాలనడం రభస సృష్టిస్తోంది.
సామాజిక స్థాయి నిర్ధారణకే
ఆదివారం బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర వెనుకబడిన వర్గాల కమిషన్ అధ్యక్షుడు మధుసూదన్ నాయక్.. 1,561 కులాల్లో 33 కులాలను విడిచిపెట్టినట్లు తెలిపారు. గతంలో కాంతరాజు కమిషన్ సమీక్షలో ఉన్న సమాచారం కాలంలను ఉపయోగించుకొని సర్వే చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమాచారాన్ని సముదాయాల ఆర్థిక, సామాజిక పరిస్థితిని తెలుసుకోవడానికే తప్ప మరో ఉద్దేశం కోసం ఉపయోగించటం లేదన్నారు. ఆధార్‌కార్డు తప్పనిసరి, ప్రతి ఒక్కరు ఆధార్ నంబరును చూపాలన్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, మార్కుల జాబితా వంటి ఆధారాలను చూపించాలని తెలిపారు.
బెంగళూరులో ఆలస్యం
రాజధాని బెంగళూరులో మాత్రం రెండు మూడురోజుల తరువాత నుంచే సర్వే మొదలవుతుంది. ఉపాధ్యాయులకు శిక్షణ ఒక వారం ఆలస్యం, గ్రేటర్ బెంగళూరు వ్యవహారాలు ఇందుకు కారణమని సమాచారం. సర్వేకు నగరంలో అదనపు సిబ్బందిని నియమించినట్లు మధుసూదన్ నాయక్ తెలిపారు.
నేటి నుంచి మళ్లీ సామాజిక సమీక్ష
బెంగళూరులో 2, 3 రోజులు ఆలస్యం
60 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి
1.75 లక్షల మంది ఉపాధ్యాయుల ఏర్పాటు
వారికి మీటర్ రీడర్ల సహకారం

ఏ కులమో చెప్పాలంతే..