
బొజ్జ గణపతికి ఘోర అపచారం
బనశంకరి: తొలి పూజలు అందుకునే విఘ్న నాయకునికి ఘోర అపచారం జరిగింది. భక్తజనం కన్నీటి పర్యంతమయ్యేలా విఘ్నేశ్వరుని మూలవిరాట్టుమీద చెప్పలహారాన్ని వేశారు. ఈ దురాగతం హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. బేలూరు పట్టణం నడిబొడ్డున గల శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానంలో జరిగిన అపచారంపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు.
ముసుగు మహిళ అకృత్యం
వివరాలు.. ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో కొందరు భక్తులు దేవుని దర్శనానికి వచ్చారు. గణపతి మూర్తి మీద రెండు చెప్పులను దారంతో కట్టి వేసి ఉండడాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. వెంటనే విగ్రహం నుంచి తీసి వేశారు. ఈ వార్త కార్చిచ్చులా జిల్లా అంతటా వ్యాపించడంతో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దుండగులను తక్షణం అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. దేవున్ని అవమానించినవారిని అరెస్టు చేసి శిక్షించాలని పట్టుబట్టారు.
పోలీసులు ఆలయ సీసీ కెమెరాల చిత్రాలను పరిశీలించగా ముసుగు వేసుకుని ఓ మహిళ లోపలికి వెళ్లి వస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఆమె ఈ అపచారానికి పాల్పడినట్లు అనుమానాలున్నాయి. జిల్లా ఎస్పీ మహమ్మద్ సుజీత ఆలయానికి వచ్చి తనిఖీ చేశారు. అనుమానితురాలి అరెస్టుకు పలు బృందాలను చుట్టుపక్కల జిల్లాలకు పంపించారు. సదరు మహిళ చిక్కమగళూరు బస్టాండులో కనిపించినట్లు సమాచారం వచ్చింది.
ఇలాంటి దుశ్చర్యలు తగదు
మతకలహాలను సృష్టించడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సాయంత్రంలోగా అరెస్ట్ చేయకపోతే సోమవారం బేలూరు బంద్ కు పిలుపునిస్తామని హిందూ సంఘాల నేతలు, భక్తులు హెచ్చరించారు. బేలూరు ను సందర్శించిన ఎమ్మెల్సీ సీటీ.రవి పదేపదే హిందువుల భావనలకు భంగం కలిగించే పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎవరు తప్పుచేసినా కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే హెచ్‌కే.సురేశ్ మాట్లాడుతూ ఆ మహిళను అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని, లేని పక్షంలో తీవ్రపోరాటం చేస్తామని హెచ్చరించారు.
మూల విరాట్టుకు చెప్పుల దండ
హాసన్ జిల్లా బేలూరు వినాయక
ఆలయంలో దుస్సంఘటన
భగ్గుమన్న భక్తులు, హిందూ సంఘాలు
అనుమానిత మహిళ అరెస్టు
చిక్కమగళూరులో మహిళ అరెస్టు
ఈ అకృత్యానికి పాల్పడిన మహిళను చిక్కమగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఆమె చిక్కమగళూరులోని దాసరహళ్లి నివాసిగా కనిపెట్టారు. స్థానిక పోలీసులు సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా గుర్తించి ఇంటికి వెళ్లి పట్టుకున్నారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.

బొజ్జ గణపతికి ఘోర అపచారం