
లోకాయుక్త వలలో పంచాయతీ టైపిస్ట్
హుబ్లీ: భవన నిర్మాణ అనుమతులకు లంచం తీసుకుంటూ పంచాయతీ టైపిస్ట్ లోకాయుక్త వలకు చిక్కుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని అల్నావరలో చోటు చేసుకుంది. సంతోష్ పూజార్ అనే వ్యక్తి భవన నిర్మాణం కోసం ఆ తాలూకా పట్టణ పంచాయతీలో దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అనుమతులు కావాలంటే లంచం ఇవ్వాలని టైపిస్టు దిపక్ కిత్తూర డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుదారుడి నుంచి టైపిస్టు రూ.12 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త డీఎస్పీ వెంకనగౌడ పాటిల్ నేతృత్వంలోని బృందం దాడి చేసింది. దిపక్ కిత్తూరను అరెస్ట్ చేశారు.
ఆయుర్వేద సమ్మేళనానికి డాక్టర్ ప్రశాంత
హుబ్లీ: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 27, 28 తేదీల్లో జరగనున్న జాగృతిక ఆయుర్వేద మహాసమ్మేళనంలో హెగ్గేరిలోని ప్రముఖ ఆయుర్వేద కళాశాల ఆస్పత్రి ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రశాంత ప్రధాన ఉపన్యాసకులుగా పాల్గొననున్నారు. మర్మ చికిత్సలపై చర్చ గోష్టి, నాడి పరీక్షపై ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తారని వైద్య సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు.
నేటి నుంచి వైద్య శిబిరం
ఆస్పత్రిలో భుజం నొప్పులకు సంబంధించి కాయచికిత్స విభాగం ద్వారా ఈనెల 22 నుంచి 27 వరకు వైద్య చికిత్స శిబిరం నిర్వహించనున్నారు. భుజం, గొంతు నొప్పి అలాగే చేతులను పైకి ఎత్తడానికి ఇబ్బందులు పడుతున్న వ్యక్తులకు ప్రత్యేక చికిత్స చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంత ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు 8073990924 నంబర్‌కు సంప్రదించాలని పేర్కొన్నారు.
నియామకం
హొసపేటె: కొప్పళ నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎస్సీ యూనిట్ విభాగం నాయకుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షెడ్యూల్డ్ కుల విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా పరశురాం కెరెహళ్లి నియమితులయ్యారు. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడు అమరేగౌడ బయ్యపుర, ఎస్సీ యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ధర్మసేన్ ఆదేశాలతో నియామక ఉత్తర్వులు అందజేశారు.
ప్లాస్టిక్ వాడకంతో
పర్యావరణానికి హాని
హొసపేటె: ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి హాని జరుగుతుందని స్నేహ యువ బలగం సభ్యులు సూచించారు. ఆదివారం పాపినాయకనహళ్లి దాల్మియా కాలనీలో ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి దుకాణాన్ని సందర్శించి, దుకాణ యజమానులు, వినియోగదారులకు ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పలితాలు, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల ప్రాముఖ్యతను వివరించారు. ప్లాస్టిక్ వదిలి పర్యావరణాన్ని కాపాడుకుందాం.. పచ్చదనం కోసం ముందుకు సాగుదాం, ప్లాస్టిక్ వదిలివేద్దాం, అందరికి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందిద్దామని నినాదాలు చేశారు. స్నేహ యువ బలగలోని 30 మంది సభ్యులు ఉత్సాహంగా అవగాహన ప్రచారంలో పాల్గొన్నారు.
విజ్ఞాన శాస్త్రంపై
విద్యార్థులకు అవగాహన
రాయచూరు రూరల్: స్థానిక విజ్ఞాన కేంద్రంలో ఆదివారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు క్రై సంస్థ, ఓరెకల్ ఆధ్వర్యంలో విజ్ఞాన శాస్త్రంపై అవగాహన కల్పించారు. ఆకాశం, గ్రహాలు, భూమి చలనాలు, గ్రహాల ఆవిర్భావంపై అజిత్ వివరించారు. కేంద్రంలో మానవుడి శరీరంలోని అవయవాలపై పరిచయం, వైజ్ఞానికంగా మానవుడి దేహంలో జరిగే హర్మోన్ మార్పులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అనిల్ కుమార్, హఫీజుల్లా తదితరులు పాల్గొన్నారు.

లోకాయుక్త వలలో పంచాయతీ టైపిస్ట్

లోకాయుక్త వలలో పంచాయతీ టైపిస్ట్