
మద్దూరు.. నిమజ్జన హోరు
మండ్య: జిల్లాలోని మద్దూరు పట్టణంలో ఆదివారం రాత్రి గణేష్ విగ్రహ ఊరేగింపు వేళ రాళ్లురువ్వడంతో చెలరేగిన ఉద్రిక్తతలు అలాగే కొనసాగుతున్నాయి. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి, దీనిని అనువుగా మార్చుకునేందుకు బీజేపీ రంగంలోకి దిగింది. బుధవారం వినాయక నిమజ్జనోత్సవం జరిగింది, బెంగళూరు నుంచి బీజేపీ సీనియర్ నేతలందరూ పాల్గొని సిద్దరామయ్య సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు.
కాషాయ కోలాహలం
నిమజ్జనం సందర్భంగా మద్దూరు కాషాయమయం అయింది. ముందు జాగ్రత్తగా పట్టణ వ్యాప్తంగా వేలాది మంది పోలీసులను మోహరించారు. గణేష్ విగ్రహాలకు అర్చనలు చేసి ఉదయం 11 గంటలకు ఊరేగింపునకు శ్రీకారం చుట్టారు. ఊరేగింపు సాగే రోడ్డులో ప్రార్థనాలయాల ముందు గట్టి పోలీసు బందోబస్తు కల్పించారు. ఊరేగింపునకు ఇరు వైపులా పహారా కాశారు. డీజే శబ్దాల మోతతో సాగిన ఊరేగింపులో విపక్ష నాయకుడు ఆర్.అశోక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర, సీఎన్ అశ్వత్థ నారాయణ, ఎమ్మెల్సీ సీటీ రవి కాషాయ జెండాలను పట్టుకుని ముందుకు సాగుతూ హిందూ సంఘాల కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కార్యకర్తలు నాయకులను భుజాలకెత్తుకుని నృత్యం చేశారు. దారి పొడవున భారీగా బాణసంచా పేల్చారు.
మద్దూరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు, జానపద కళాబృందాలు తరలివచ్చి ఊరేగింపులో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం సర్కిల్ నుంచి ప్రారంభమైన ఊరేగింపు పేటె వీధి గుండా సాగింది. అనంతరం ఎంసీ రోడ్డు, కొల్లి సర్కిల్ గుండా హొళె ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు కొన్ని గణేష్ విగ్రహాలు చేరుకోగా, అక్కడి నుంచి 5 కిమీ దూరంలోని ఉప్పినకెరె చెరువులో నిమజ్జనం చేశారు.
తుగ్లక్ దర్బార్ నడుస్తోంది
విజయేంద్ర
శివాజీనగర: మద్దూరులో పోలీస్ శాఖ పూర్తిగా విఫలమైందనేది స్పష్టంగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. ఆయన బెంగళూరులో, మద్దూరులో మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ దర్బార్ నడుస్తోంది, నిజాముల పాలనను గుర్తుకు తెస్తున్నారు, ముఖ్యమంత్రి, హోం మంత్రి వారి ధోరణిని సరిచేసుకోని పక్షంలో శాంతిభద్రతలు అస్తవ్యస్తంగా మారుతాయని అన్నారు. నిమజ్జనంలో కాషాయ శాలువాను వేసుకుని డ్యాన్స్ చేసిన ఓ ఎస్‌ఐను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు తెలిసింది, మనమేమైనా పాకిస్తాన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. రోజురోజుకు పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. శాంతిభద్రతలు నాశనమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఇటువంటి దుర్భుద్ధి వచ్చింది. ఈ ప్రభుత్వానికి హిందువులు ఏమి అన్యాయం చేశారని మండిపడ్డారు.
ఉద్రిక్తత, నిషేధాజ్ఞల మధ్య ఊరేగింపు
తరలివచ్చిన బీజేపీ నాయకులు
సిద్దరామయ్య ప్రభుత్వంపై ధ్వజం
సిద్దు.. పాకిస్తాన్‌కు వెళ్లిపో
బీజేపీ పక్ష నేత అశోక్
మండ్య: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, కాంగ్రెస్ వారికి దమ్ము ఉంటే గణేష్ విగ్రహ ఊరేగింపుపైకి రాళ్లు విసిరిన వారిపై గూండా చట్టం కింద కేసులు నమోదు చేయాలని బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ డిమాండ్ చేశారు. నిమజ్జన ఊరేగింపులో ఆయన ప్రసంగించారు. ఈ ఘటనను మరిస్తే మనకు ఉనికి లేదన్నారు. సీఎం సిద్దరామయ్యను పాకిస్తాన్‌కు పంపేయాలని, కర్ణాటకను ఇటలీ, అఫ్ఘనిస్థాన్ కానివ్వబోమన్నారు. కాంగ్రెస్ వారిని ఇలానే వదిలేస్తే రాబోయే రోజుల్లో గణేష్ పండుగనే బ్యాన్ చేస్తారని అన్నారు. సిద్దరామయ్య ముల్లా టోపీ వేసుకుని హిందూలకు టోపీ వేస్తున్నారు. ధర్మస్థలకు వ్యతిరేకంగా అపప్రచారం చేశారు. ముస్లింలపై కేసులను వాపసు తీసుకుంటారు కానీ హిందువులపై కేసులను రద్దు చేయరు అని ఆరోపించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి డీసీ తమ్మణ్ణ, మాజీ ఎంపీ సుమలత అంబరీష్, ఎమ్మెల్యే హెచ్‌టీ మంజు, పెద్దసంఖ్యలో నేతలు పాల్గొన్నారు.

మద్దూరు.. నిమజ్జన హోరు