
కన్నడ దర్శకనటుడు ఎస్ నారాయణ్ (S Narayan)పై వరకట్నం వేధింపుల కేసు నమోదైంది. నారాయణ్ కుటుంబం వరకట్నం కోసం వేధిస్తోందంటూ ఆయన కోడలు పవిత్ర బెంగళూరు పోలీసులను ఆశ్రయించింది. తనకేదైనా జరిగితే భర్త, అత్తమామలదే పూర్తి బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు రమ్మని నారాయణ్, అతడి భార్య భాగ్యవతి, కుమారుడు పవన్‌కు నోటీసులు పంపారు.
ఫిర్యాదులో ఏముందంటే?
'నా భర్త పవన్ డిగ్రీ కూడా పూర్తి చేయలేదు. అతడికి ఎటువంటి ఉద్యోగం లేదు. దీంతో నేనే కుటుంబాన్ని చూసుకుంటున్నాను. ఓసారి అతడు కారు కొనాలంటూ నా దగ్గర రూ.1 లక్ష, నా తల్లి దగ్గరి నుంచి రూ.75 వేలు తీసుకున్నాడు. నా భర్త కుటుంబం కళా సామ్రాట్ ఫిలిం అకాడమీ స్థాపించినప్పుడు నేను నా తల్లి బంగారం కూడా తాకట్టు పెట్టి వారికి ఆర్థిక సాయం చేశాను. కానీ, ఆ అకాడమీ ఎంతోకాలం నడపలేదు, కొంతకాలానికి మూసివేశారు.
నేను సంపాదించి పోషించా..
తర్వాత మళ్లీ నన్ను డబ్బు అడగడం ప్రారంభించారు. రూ.10 లక్షలు లోన్ తీసుకునిచ్చాను. కొన్నినెలలు సరిగానే చెల్లించి తర్వాత ఆపేశారు. నా పెళ్లి సమయంలో నాన్న పవన్‌కు రూ.1 లక్ష విలువైన బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. మా పెళ్లి విషయంలో నారాయణ్ దంపతులు గొడవపడ్డారు. పెళ్లయిన కొన్ని నెలలకే ఇంట్లోంచి బయటకు వచ్చి ఓ అద్దెగదిలో ఉన్నాం. ఓ సంవత్సరం తర్వాత తిరిగి మళ్లీ అత్తింట్లో అడుగుపెట్టాం' అని పవిత్ర పేర్కొంది.
సినిమా
చైత్రద ప్రేమాంజలి (1992) కన్నడ సినిమాతో నారాయణ్ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. అనురాగద అలెగలు, మేఘ మాలె, తవరిన తొట్టిలు, బేవు బెల్ల, సూర్యవంశం, సింహాద్రియా సింహ, దక్ష, చంద్ర చకోరి, మనసు మల్లిగె.. ఇలా ఎన్నో సినిమాలు డైరెక్ట్ చేశాడు. తమిళంలో జై సినిమా తీశాడు. చైత్రద ప్రేమాంజలి, కురిగలు సార్ కురిగలు, హనీమూన్ ఎక్స్‌ప్రెస్, తిప్పరల్లి తర్లెగలు, ఓల్డ్ మాంక్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.
చదవండి: మద్యానికి, సిగరెట్‌కు గుడ్‌బై.. శాకాహారిగా మారిపోయిన రణ్‌బీర్!