
కౌన్సిలర్ చొరవతో అంధుడికి వివాహం
రాయచూరు రూరల్: నగరంలో ఓ నగరసభ సభ్యుడు అంధుడికి వివాహం జరిపించిన ఘటన చోటు చేసుకుంది. బుధవారం యరమరస్‌లో కౌన్సిలర్ నరసారెడ్డి అంధుడు అనాథ రంగప్ప(33)కు కోలారుకు చెందిన నారాయణమ్మతో మూడు రోజుల క్రితం కోలారులో వివాహం చేయించారు. యరమరస్ వీరాంజనేయ కళ్యాణ మంటపంలో అంగరంగ వైభవంగా ఇద్దరికి అక్షతారోహణం చేశారు. రంగప్ప క్రైస్తవ మిషనరీలో ప్రచారకర్తగా విధులు నిర్వహిస్తున్నారు.
కుక్క కాటుపై నిర్లక్ష్యం వద్దు
బళ్లారిటౌన్: కుక్క కాటు వేసిన లేదా గోకిన వెంటనే వైద్యులను సంప్రదించాలని జిల్లా సర్వేక్షణ అధికారి డాక్టర్ మరియం బీ పేర్కొన్నారు. జిల్లా పాలన, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ సర్వేక్షణ శాఖల ఆధ్వర్యంలో కౌల్‌బజార్ ఆరోగ్య కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన జనజాగృతి కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కుక్క కరచిన వెంటనే కరిచిన ప్రాంతంలో సబ్బు నీటితో శుభ్రంగా కడిగి వెంటనే వైద్యులను సంప్రదిస్తే రేబిస్ వ్యాధి నుంచి బయటపడవచ్చన్నారు. కుక్క కాటుకు రేబిస్ నిరోధక ఇంజెక్షన్ అందుబాటులో ఉందన్నారు. ఈ వ్యాధి సోకిన వారు నిర్లక్ష్యం చేస్తే మరణించే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ రోగి నీరు తాగడం మానతారని, గాలి, వెలుగు పడితే భయపడతారని వివరించారు. అదే విధంగా పాము కాటు వేసినప్పుడు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ఆస్పత్రికి వెళ్లాలన్నారు. కొంత మంది పాము కాటు వేసిన వెంటనే బ్లేడ్‌తో, చాకుతో కోస్తూ పసరు వైద్యాన్ని అందిస్తూ నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతారన్నారు. డిప్యూటీ మేయర్ డీ.సుకుం, వైద్యాధికారులు నజీబ్ అలీం, విశాలాక్షి, స్వప్న, జబీన్‌సాద్, శరత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
హొసపేటె: నగరంలోని మహిళా సమాజ్ స్కూల్ ఎదురుగా ఉన్న కోర్టు పక్కన దాదాపు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మృతుడు 5.6 అడుగుల ఎత్తు, దాదాపు 2–3 అంగుళాల పొడవైన నల్లటి జట్టు, గుండ్రని ముఖం, సాధారణ శరీరాకృతి, ఛాతీపై పెద్ద పుట్టుమచ్చ, కుడి చేతిలో అమ్మ, ఎడమ చేతిలో తిప్పేష్ భూ అనే పచ్చబొట్టు ఉన్నాయి. మృతుడు తెల్లటి కాలర్, నీలిరంగు లోదుస్తులు, బూడిద రంగు నైట్ ప్యాంటుతో పూర్తి చేతుల నీలిరంగు టీ–షర్టు ధరించి ఉన్నాడు. ఈ అజ్ఞాత వ్యక్తి గురించి ఆచూకీ తెలిస్తే హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్ పీఐకు లేదా 08394–224033 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలని ఓ ప్రకటనలో కోరారు.
సైబర్ కేటుగాళ్లపై జాగ్రత్త అవసరం
●గత ఏడాది రూ.70 కోట్లకు పైగా
సైబర్ మోసాలు
బళ్లారిటౌన్: గత ఏడాది బళ్లారిలో సైబర్ కేటుగాళ్ల వల్ల రూ.70 కోట్లకు పైగా ప్రజలు మోసపోయారని, దీనిపై జాగ్రత్త వహించాలని సైబర్ నేరాల డీఎస్పీ సంతోష్ చౌహాన్ పేర్కొన్నారు. గురువారం బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ బుధవారం స్టేడియం రోడ్డులోని బృందావన లాడ్జి హాల్‌లో ఏర్పాటు చేసిన బజాజ్ ఫైనల్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన డిజిటల్ వినియోగదారులకు అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నకిలీ ఓటీపీ, పిచింగ్, రుణ సౌకర్యాలు, పెన్షన్ వంటి ఆశలతో ప్రజలను మభ్యపెట్టి లోబరుచుకుంటు మోసాలు చేస్తున్నారని వివరించారు. ఓ సీనియర్ సిటిజన్ రూ.2 కోట్లకు పైగా పోగొట్టుకున్న కేసులు కూడా ఇటీవల తమ దృష్టికి వచ్చాయన్నారు. ఎక్కువగా ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు వృత్తి వైద్యులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు కూడా సైబర్ మోసగాళ్లకు బలి అవుతున్నారని వివరించారు. సామాజిక మాధ్యమంలో వచ్చే డిజిటల్ నకిలీ ప్రకటన చూసి మోసపోవద్దన్నారు. సైబర్ నేరగాళ్లకు మోసపోయిన వెంటనే 1930కి కాల్ చేసి సహాయం కోరాలని ఆయన వివరించారు. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ జోనల్ మేనేజర్ వెంకటేశమ్, రిటైర్డ్ డీఓఎస్పీ శ్రీధర్ దొడ్డి తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిలర్ చొరవతో అంధుడికి వివాహం

కౌన్సిలర్ చొరవతో అంధుడికి వివాహం

కౌన్సిలర్ చొరవతో అంధుడికి వివాహం