
గుడిసాగరలో అతిసార విజృంభణ
హుబ్లీ: జిల్లాలోని నవలగుంద తాలూకాలోని గుడిసాగర గ్రామంలో అతిసారతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 29 మందికి గాను 9 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జి అయ్యారు. ఓ మహిళను కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. 19 మంది చికిత్స పొందుతున్నారు. గ్రామంలోని ఉపకేంద్రంలో క్లినిక్ తెరిచారు. ఆ గ్రామంలో ఇళ్ల సర్వే చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్‌హెచ్.కోనరెడ్డి, జిల్లాధికారి దివ్యప్రభు, సీఈఓ భువనేష్ పాటిల్, ఎస్పీ గుంజన్ ఆర్య తాలూకా ఆస్పత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. తాగునీటి చెరువు నుంచి ఈ అతిసార వ్యాపించిందని గ్రామస్తులు ఆరోపించారు. చెరువు అలాగే ఎగువ భాగాన ఉన్న జలాశయం ఇంటింటి కొళాయిల్లోని నీటిని సేకరించి పరీక్షకు పంపించారు. ఆ పరీక్షల నివేదికలు చేరాక చర్యలు తీసుకుంటారు. 30 మంది ఆశా సభ్యుల బృందం ఏర్పాటు చేసి గ్రామంలో ఇంటి సర్వే ప్రారంభించారు.
చురుగ్గా ఇళ్ల సర్వే
ఇప్పటి వరకు 600కు పైగా ఇళ్ల సర్వే చేపట్టి కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నట్లు జిల్లాధికారి తెలిపారు. సదరు గ్రామంలో మూడు, పారిశుధ్య, తాగునీటి యూనిట్లు ఉండగా కొద్ది మేర మరమ్మతులకు గురయ్యాయి. ప్రస్తుతం ఒకదాని మరమ్మతు చేపట్టి నీటి సరఫరా చేస్తున్నారు. మిగిలిన వాటిని తక్షణమే మరమ్మతు చేయాలని సూచించానన్నారు. ఇప్పటి వరకు నవలగుంద నీలమ్మ చెరువు నుంచి రెండు ట్యాంకర్ల ద్వారా రక్షిత మంచి నీటిని గుడిసాగరకు సరఫరా చేస్తున్నట్లు జెడ్పీ సీఈఓ భువనేష్ పాటిల్ తెలిపారు. చెరువు చుట్టు కంచె లేదు. దీంతో పశువులు, పక్షులు, చెరువులోకి దాహార్తిని తీర్చుకునేందుకు వెళ్లడంతో నీరు కలుషితం అవుతోంది. చెరువు చుట్టు తీగలతో కంచె ఏర్పాటు చేయాలని, చెరువు నీటి శుద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డీహెచ్‌ఓ ఎం.వనకేరి, వైద్యాధికారి డాక్టర్ రూపా, తహసీల్దార్ సుధీర్, ఈఓ భాగ్యశ్రీ, సీఐ రవి, ఆ జీపీ చైర్‌పర్సన్ రత్నమ్మ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
వాంతులు విరేచనాలతో అస్వస్థత
కిమ్స్ ఆస్పత్రిలో ఒకరి చేరిక