
త్వరలో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ
బళ్లారిఅర్బన్: పేద ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న నగర శివారులోని ముండ్రగి వద్ద రాజీవ్ గాంధీ టౌన్‌షిప్ పథకం ద్వారా ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వెయ్యి ఇళ్లను సంబంధిత లబ్ధిదారులకు త్వరలోనే పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన సదరు ఇళ్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఆ ఇళ్ల నిర్మాణ తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాలికె కమిషనర్ మంజునాథ్‌తో పాటు పలువురు అధికారులు నారా భరత్‌రెడ్డికి ఇళ్ల నిర్మాణ లబ్ధిదారుల జాబితా గురించి వివరించారు. ఇళ్లను తీసుకోవడానికి ఇప్పటికే లబ్ధిదారులు ప్రభుత్వం నిర్ణయించిన డబ్బులను చెల్లించారన్నారు. అయితే ఇళ్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర గృహ వసతి శాఖ మంత్రి జమీర్ అహ్మద్‌ఖాన్‌తో చర్చించామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వమే లబ్ధిదారుల డబ్బులను చెల్లించి నూరు శాతం ఉచితంగా ఇళ్లను పంపిణీ చేసే ఉద్దేశం కలిగి ఉందన్నారు. పూర్తి కాని ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేస్తారన్నారు. తొలి విడతగా వెయ్యి ఇళ్లను ఒకేసారి పంపిణీ చేయాలని సంకల్పించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్‌ల సమక్షంలో పేదలకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని, ఆ మేరకు త్వరలో కార్యక్రమం జరిపే తేదీని నిర్ణయించి ప్రకటిస్తామన్నారు. ప్రముఖులు చానాళ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వెల్లడి
బళ్లారిలోని నిరాశ్రయులకు శుభవార్త

త్వరలో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ

త్వరలో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ