
బెట్టింగ్ కింగ్ ఆటకట్టు?
సాక్షి బళ్లారి: చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ.వీరేంద్ర పప్పి మీద ఈడీ దాడులు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ సర్కారుతో పాటు ప్రజాప్రతినిధులను కలవరానికి గురిచేస్తున్నాయి. ఆయనతో సంబంధాలు ఉన్నవారు ఇప్పుడు ఈడీ పిలుపు వస్తుందని వణికిపోవడం గమనార్హం. ఆగస్టు 23వ తేదీ నుంచి చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్ర, సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులు, క్యాసినో కేంద్రాల్లో ఈడీ విస్తృత తనిఖీలు చేపట్టింది. చిత్రదుర్గ, చెళ్లకెరె, గోవా, ముంబై తదితర ప్రాంతాల్లో ఆయన జూద వ్యాపారాలు విస్తరించాయి.
ఖరీదైన కార్లు, నగదు సీజ్
బెంగళూరు, చిత్రదుర్గ, చెళ్లకెర తదితర ప్రాంతాల్లో ఆయన నివాసాల్లో అత్యంత ఖరీదైన కార్లు, భారీగా నగదు ఉన్నట్లు వెలుగు చూసింది. విలాసవంతమైన ఐదు కార్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. తొమ్మిది బ్యాంక్ ఖాతాలలో ఉండిన రూ.55 కోట్ల నగదును జప్తు చేసినట్లు సమాచారం. బెట్టింగ్, క్యాసినోలు తదితర వ్యాపారాల ద్వారా వచ్చే నగదు నిర్వహణకు ఏకంగా 262 బ్యాంక్ ఖాతాలను ఏర్పాటు చేసుకొన్నట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. వీరేంద్ర సోదరుడైన కేసీ.తిప్పేస్వామి, కొందరు సన్నిహితులు గోవా, ముంబై నుంచి కథ నడిపేవారు. అంతే కాకుండా వీరేంద్ర కింగ్ పేరుతో 567, రాజా 567, లయన్ 567 లాంటి వెబ్‌సెట్ల ద్వారా ఆన్‌లైన్ పందేల ద్వారా రెండుచేతులా ఆర్జించారని ఈడీ ఆరోపిస్తోంది.
మరోవైపు వీరేంద్ర పప్పి ఈడీ కస్టడీని బెంగళూరు కోర్టు మరో 4 రోజులు పొడిగించింది. గురువారం కోర్టులో హాజరుపరిచి విచారణ కొనసాగించాల్సి ఉందని ఈడీ న్యాయవాదులు కోరగా కోర్టు అనుమతించింది. పప్పి వకీళ్ల వాదనలు వీగిపోయాయి.
ఈడీ గుప్పిట్లో చిత్రదుర్గ ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి
విలాసవంత కార్లు, నగదు సీజ్
కొనసాగుతున్న ఈడీ కస్టడీ

బెట్టింగ్ కింగ్ ఆటకట్టు?