
= దేవనహళ్లి ఠాణాపై లోకాయుక్త దాడులు
దొడ్డబళ్లాపురం: లంచం తీసుకుంటున్న సమయంలో లోకాయుక్త అధికారులు దాడి చేయగా ఠాణా నుంచి కానిస్టేబుల్, మహిళా ఎస్సై పరారైన సంఘటన దేవనహళ్లిలో చోటుచేసుకుంది. పోక్సో కేసులో అనుకూలంగా చార్జ్‌షిట్ తయారు చేస్తామని, ఇందుకు రూ.70 వేలు ఇవ్వాలని దేవనహళ్లి పోలీస్‌స్టేషన్ మహిళా ఎస్సై జగదేవి, ఇద్దరు కానిస్టేబుళ్లు డిమాండు చేశారు. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీంతో బాధితుడు లోకాయుక్తను ఆశ్రయించాడు.
అతని నుంచి రూ.50 వేలు లంచంగా తీసుకుంటుండగా బుధవారం సాయంత్రం లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. కానిస్టేబుల్ అమరేశ్ పట్టుబడగా మరో కానిస్టేబుల్ మంజునాథ్, ఎస్సై జగదేవి ఇద్దరూ కాలికి బుద్ధిచెప్పారు. లోకాయుక్త ఎస్పీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడి జరిగింది. ఠాణాలో సోదాలు చేసి పలు రికార్డులను సీజ్ చేశారు. పరారైన వారి కోసం గాలింపు సాగుతోంది. ఈ సంఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది. \
లైన్‌మ్యాన్‌కు షాక్
మీటర్ మార్చడానికి రూ.10 వేలు లంచం డిమాండు చేసిన బెస్కాం లైన్‌మ్యాన్ లోకాయుక్తకు చిక్కిన సంఘటన చెన్నపట్టణలో చోటుచేసుకుంది. చెన్నపట్టణ తాలూకా బేవూరు బెస్కాం సబ్ డివిజన్ లైన్‌మ్యాన్ రమేశ్‌ను హనుమంతయ్య అనే వ్యక్తి కలిసి ఇంటి పాత మీటర్ మార్చి కొత్త మీటర్ అమర్చాలని కోరాడు. ఇందుకు రూ.10వేలు లంచం అడిగాడు. ఆ లంచం తీసుకుంటుండగా లోకాయుక్త సిబ్బంది దాడి చేసి రమేశ్‌ని పట్టుకున్నారు.