
శిశు విక్రయం.. ముగ్గురు అరెస్టు
యశవంతపుర: అత్యాచారం వల్ల జన్మించిన శిశువును అమ్మిన ముగ్గురు సభ్యుల ముఠాను ఉడుపి పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ సోమేశ్ సొలొమన్, మధ్యవర్తి విజయలక్ష్మీ, అత్యాచార నిందితుడు నవనీత్ నారాయణలను అరెస్ట్ చేశారు. వివరాలు.. అత్యాచారానికి గురైన యువతి గర్భం దాల్చగా, అంగన్‌వాడీ నుంచి పోషణ్ అభియాన కింద ఆహార పదార్థాలు తీసుకునేది. కాన్పు అయిన తరువాత శిశువు ఆమె వద్ద లేదని బయట పడింది. పోలీసుల దర్యాప్తులో శిశువును రూ. 4 లక్షలకు అమ్మేసినట్లు బయట పడింది. నవనీత్ నారాయణ మానసిక వైకల్యం గల యువతిపై అత్యాచారం చేశాడు. యువతికి శిశువు జన్మించిన తరువాత ఉడుపి దంపతులకు ఆస్పత్రిలోనే అమ్మేశారు. ఇందులో డాక్టర్ సోమేశ్ సోలోమన్, మధ్యవర్తి పాత్ర ఉంది. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. అలాగే శిశువును కొన్న దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
యువతి మృతి..
ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి
మండ్య: చికిత్సకు తీసుకువచ్చిన యువతి చనిపోయిందని వైద్యులు చెప్పడంతో పెద్ద గొడవ జరిగింది. జిల్లాలోని మళవళ్ళి పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. కొళ్లేగాలకు చెందిన ద్వితీయ పియుసి విద్యార్థిని షిఫా అనే యువతి హలగూరులో తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో షిఫాకు అనారోగ్యంగా ఉండడంతో హలగూరులోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేశారు. అయితే పరిస్థితి విషమించడంతో మళవళ్లిలోని తాలూకా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యాధికారి మురళి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆమె మరణించింది అని చెప్పడంతో కొందరు యువకులు రభస చేశారు. వైద్యునిపై దాడి చేసి కొట్టారు. అద్దాలను, బెంచీలను ధ్వంసం చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి దుండగులను అడ్డుకున్నారు. ఈ దాడితో వైద్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
వారికి సంప్రదాయం తెలుసా?
● సర్కారుపై మంత్రి సోమణ్ణ ధ్వజం
మైసూరు: చాముండి కొండ భక్తికి, నమ్మకానికి చరిత్రకు మరో పేరని, ఈసారి దసరా వేడుకలను ప్రారంభించే వారికి కన్నడనాడిన శక్తిమాత చాముండేశ్వరి దేవి చరిత్రను, గొప్పదనాన్ని తెలిసేలా చేయాలని కేంద్ర మంత్రి వి.సోమణ్ణ అన్నారు. గురువారం మైసూరు అతిథి గృహంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. దసరా ఉత్సవాలను ప్రారంభించే వారికి సంప్రదాయం గురించి తెలియాలని పరోక్షంగా రచయిత్రి బాను ముష్తాక్‌ను ఎంపిక చేయడం గురించి విమర్శించారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి ఏమి చేస్తున్నారు, దాని గురించి తెలుసా, లేదా, ఆ అర్హత ఉన్నదా లేదా అని కూడా చర్చ జరగాలని అన్నారు. ఎవరైనా గానీ సంప్రదాయాలను కాపాడాలి తప్ప తప్పుడు నిర్ణయాలను తీసుకోరాదని రాష్ట్ర సర్కారుపై మండిపడ్డారు. ప్రభుత్వం ఎవరిని సంతోషపెట్టడానికి దసరా ప్రారంభకులను ఎంపిక చేసిందో అర్థం కావడం లేదని విమర్శించారు.