
గుంతల రోడ్లు ఉండరాదు
● కేంద్ర పాలికె కమిషనర్
బనశంకరి: కేంద్ర నగర పాలికె పరిధిలో వాహన సంచారం, సురక్షత, మౌలిక సౌకర్యాలను మెరుగుపరచాలి. గుంతలు రహిత, బ్లాక్‌స్పాట్ రహిత, ఆక్రమణ రహిత ఫుట్‌పాత్ మార్గాల నిర్మాణానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆ పాలికె కమిషనర్ రాజేంద్రచోళన్ తెలిపారు. గురువారం కేంద్రనగర పాలికె కార్యాలయాన్ని సందర్శించి ఇంజినీర్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రమాదాలు సంభవించకుండా ముందుజాగ్రత్తచర్యలు తీసుకోవాలన్నారు. గుంతల రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గుంతల రోడ్లపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. సీబీడీ రోడ్డు, టెండర్‌షూర్ రోడ్లు, వైట్ టాపింగ్ రోడ్లు, హైడెన్సిటి కారిడార్ రోడ్లుగా రహదారులను విభజించి ఆదర్శ రోడ్లుగా తీర్చిదిద్దాలని పాలికె ఇంజినీర్లకు సూచించారు. మెట్రో పిల్లర్లకు హంగులు, రోడ్లు పక్కన పచ్చదనం కోసం మొక్కలు నాటడం, అవసరమైనచోట వీధి దీపాలను అమర్చాలని తెలిపారు. ప్రతివారం ఒక రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగించి స్వచ్ఛతా అభియాన చేపట్టాలన్నారు.
రౌడీ బిక్లు హత్య కేసులో కస్టడీ
యశవంతపుర: బెంగళూరు కేఆర్ పురకు చెందిన రౌడీషీటర్ బిక్లు శివకుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడు జగదీశ్‌ను ఐదు రోజుల పాటు విచారణ నిమిత్తం కోర్టు సీసీబీ కస్టడీకీ అనుమతించింది. బిక్లు శివ హత్య కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న జగదీశ్‌ను సీఐడీ పోలీసులు ఢిల్లీ విమానాశ్రయంలో ఇటీవల బంధించారు. అతనిపై కోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ హత్యకు కారణాలు విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఓ బీజేపీ ఎమ్మెల్యే కూడా నిందితునిగా ఉండడంతో అందరి కళ్లు ఈ కేసు మీదే ఉన్నాయి.