
హుబ్లీ పాత బస్టాండ్ పునరారంభం
హుబ్లీ: ప్రధాన చెన్నమ్మ సర్కిల్ పైవంతెన పనుల నేపథ్యంలో నాలుగున్నర నెలల క్రితం బంద్ చేసిన ఉపనగర కేంద్ర బస్టాండ్ బుధవారం నుంచి పునరారంభమైంది. ఉదయం నుంచే బస్సులు చెన్నమ్మ సర్కిల్ నుంచి బసవనం వరకు రాక పోకలు ప్రారంభించాయి. పైవంతెన గత నెల ఏప్రిల్ 20వ తేదీ నుంచి బస్టాండ్‌తో పాటు ఎదుట ఉన్న రోడ్డు అలాగే చెన్నమ్మ సర్కిల్ నుంచి పాత కోర్టు వరకు రోడ్డును బంద్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు ముగిసిన నేపథ్యంలో బస్టాండ్ కార్యకలాపాలు చాలా వరకు ప్రారంభం అయ్యాయి. ఈ విషయమై కేఎస్‌ఆర్‌టీసీ వాయువ్య విభాగం ఎండీ ఎం.ప్రియాంక్ మాట్లాతుతూ ఫ్‌లై ఓవర్ పనుల నుంచి జిల్లాధికారి సూచనల మేరకు కొన్ని నెలలుగా బస్టాండ్‌ను బంద్ చేశామన్నారు. ప్రస్తుతం బస్టాండ్ పరిసర పనులు ముగిశాయి. దీంతో జిల్లా ఆర్‌టీసీ డీసీ సంబంధిత హైవే అధికారులు, ఇంజినీర్లు స్థల పరిశీలన చేసి బస్సుల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు.
యథావిధిగా నగర రవాణా సంచారం
దీంతో బుధవారం నుంచి యథావిధిగా బస్సుల సంచారం ప్రారంభించామన్నారు. యథావిధిగా నగర రవాణా, ప్రాంతీయ రవాణా, బీఆర్‌టీఎస్ నగర రవాణా సంచారం జరగనుంది. అంతేగాక గదగ్ నుంచి వచ్చే బస్సుల్లో ప్రయాణికులకు మాత్రం ఈ బస్టాండులో దిగడానికి అవకాశం కల్పించామన్నారు. గత నాలుగున్నర నెలల నుంచి బంద్ అయిన బస్టాండ్ నుంచి ఎటువంటి చోరీలు జరగలేదు. సిబ్బంది కాపలా ఉన్నారు. స్థానికులు బస్టాండ్ ప్రారంభం కావాలని డిమాండ్ చేశారు. దీంతో తిరిగి బస్టాండ్‌ను ప్రారంభిమన్నారు. మొత్తం మీద బస్టాండ్‌కు కొత్త కళ సంతరించుకుంది. గత కొన్ని నెలల పాటు వ్యాపారస్తులు వ్యాపారాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బస్టాండ్ ప్రారంభంతో అంగళ్లన్నిటిని ఎప్పటిలాగే తెరిచి తమ వ్యాపారాలను పునరారంభించారు.
నాలుగున్నర నెలలుగా
మూతపడిన వైనం
ఎప్పటిలానే తిరిగి తెరుచుకున్న అంగళ్లు