
అంజనాద్రి బెట్టకు కొత్త రూపు: సీఎం
శివాజీనగర: ప్రముఖ పర్యాటక కేంద్రం హంపీకి సమీపంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న అంజనాద్రి బెట్టను పర్యాటకంగా, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను తెలియజేసే తరహాలో అభివృద్ధిపరచాలని సీఎం సిద్దరామయ్య సూచించారు. అంజనాద్రి క్షేత్ర అభివృద్ధి గురించి బుధవారం బెంగళూరులో సీఎం నివాసంలో భేటీ జరిగింది. సీఎం మాట్లాడుతూ అంజనాద్రి పర్వతంపై సౌకర్యాలను కల్పించాలి, ప్రదక్షిణ మార్గం నిర్మించాలి, మెట్ల సదుపాయం, సముదాయ భవనం తదితర నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. బెట్ట వద్ద పనులకు భూమి కొరత ఉందని, భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. కొన్ని పనులకు అటవీశాఖ ఆమోదం తీసుకోవాలన్నారు. అంజనాద్రి కొండతో పాటుగా రాష్ట్రంలో 11 పర్యాటక కేంద్రాలకు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోప్ వేలను నిర్మించనున్నట్లు తెలిపారు.
మంత్రికి సొమ్ముల కేసులో లోకాయుక్త తనిఖీ
శివాజీనగర: అక్రమ సంపాదన కేసులో గృహ నిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్‌కు లోకాయుక్త షాక్ ఇచ్చింది. ఇటీవల ఆయనతో లావాదేవీలు కలిగిన వ్యక్తులపై దృష్టి సారించింది. మంత్రి జమీర్ అహ్మద్‌కు 2013లో బడా వ్యాపారి, కాంగ్రెస్ నేత కేజీఎఫ్ బాబు రూ.3.70 కోట్లు అప్పు ఇచ్చారని గతంలో చెప్పారు. ఆ కేసులో లోకాయుక్త అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. మంత్రికి డబ్బులు ఇచ్చిన కేసులో నటి రాధికా కుమారస్వామిని కూడా లోకాయుక్త పోలీసులు ఇటీవలే విచారించారు.
దంపతులకు శిరోముండనం
● గ్రామపెద్దల దాష్టీకం
మండ్య: చిన్న కారణానికి భార్యాభర్తలు గొడవ పడటంతో గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించారు. ఆ దంపతులకు గుండు గీయించిన ఘటన జిల్లాలోని మళవళ్లి తాలూకా ద్యావపట్టణ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసింది. గతనెల 17న ఉదయం 6 గంటల సమయంలో మహిళ, ఆమె పిల్లలు తన భర్తతో తాగుడు విషయంపై గొడవ పడ్డారు. భార్య గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. నీతో పాటు నీ భర్తకు తలా రూ.5 వేల జరిమానా, ఇద్దరు గుండు గీయించుకోవాలని రచ్చబండ వద్ద తీర్పు చెప్పారు. అంతేకాకుండా దగ్గరుండి ఇద్దరికీ శిరోముండనం చేయించారు. దీంతో బాధితురాలు లబోదిబోమంది. గ్రామంలో తిరగలేకపోతున్నానని, న్యాయం కోరితే ఇలా అవమానం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెళకవాడి ఎస్‌ఐ ప్రకాష్ ఆ గ్రామంలో విచారించి నాగణ్ణ, మహాదేవ, కుమార్, సోమణ్ణ, మల్లయ్యలతో సహా ఐదుగురిపై కేసు నమోదు చేశారు.
ఎర్రచందనం పట్టివేత
దొడ్డబళ్లాపురం: ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోట తాలూకా కట్టిగెహళ్లికి ఎర్రచందనాన్ని తరలించిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఎర్రచందనం దుంగలను అక్కడి నుంచి మళ్లీ హరియానాకు తరలిస్తుండగా దాడి చేసిన పోలీసులు రూ.25 లక్షల విలువైన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎజాజ్ షరీఫ్, ఫయాజ్ షరీఫ్, సాదిక్ ఖాన్ అనే ముగ్గురిని హొసకోట పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.