
భీమా తీరంలో కాల్పుల మోత
● జీపీ అధ్యక్షుని హత్య
హుబ్లీ: భీమా నది తీరంలో మళ్లీ కాల్పు మోత మోగింది. పట్టపగలే గ్రామ పంచాయతీ అధ్యక్షుడు భీమనగౌడ బిరాదర (46)పై దుండగులు కాల్పులు జరిపి చంపారు. విజయపుర జిల్లా దేవర నింబరిగి గ్రామంలో బుధవారం ఈ ఘోరం జరిగింది. ఈయన మహాదేవ బైర గొండన పరమాత్మకు కుడి భుజంగా ఉండేవాడు. కటింగ్ సెలూన్ వద్ద ముసుగులు ధరించిన ముగ్గురు నలుగురు వ్యక్తులు భీమనగౌడ తల, శరీరంపై కాల్పులు జరపడంతో అక్కడే మరణించాడు. కంట్లోకి కారం చల్లి దాడి చేశారు. స్థానికులు ఆయన్ను విజయపురలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. కాగా ఈ దారుణ హత్యతో ఆ గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. భీమా తీర గ్రామాల్లో దశాబ్దాల నుంచి ముఠాల మధ్య కక్షలు రగులుతున్నాయి. ఈ హత్యాకాండల గురించి సినిమాలు కూడా వచ్చాయి.
మరో బాలుడు మృత్యువాత
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణ పరిధిలోని ముత్తూరులో గత శుక్రవారంనాడు వినాయక నిమజ్జనం ఊరేగింపులో ప్రమాదవశాత్తు టపాసుల పెట్టె పేలిన సంఘటనలో యోగేశ్ (15) అనే మరో బాలుడు మరణించాడు. గత శుక్రవారం సాయంత్రం ముత్తూరు గ్రామంలో నిమజ్జనం ఊరేగింపులో టపాసుల పెట్టె విస్ఫోటం చెందింది. ఆ దుర్ఘటనలో ధనుష్ రావ్ (15) అనే బాలుడు తీవ్రగాయాలై అక్కడే మృతిచెందాడు, ఒక పోలీసులతో పాటు 9మంది గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యోగేశ్ మంగళవారంనాడు పరిస్థితి విషమించి కన్నుమూశాడు.