
వ్యక్తిగత ద్వేషంతో పంటకు నష్టం
హొసపేటె: రైతు పండించిన పంటను దుండగులు వ్యక్తిగత ద్వేషంతో నాశనం చేసిన ఘటన విజయనగర జిల్లా హూవిన హడగలి తాలూకాలోని హొళగుందిలో జరిగింది. గ్రామానికి చెందిన మెళ్లి హాలప్ప పొలంలో పండించిన మొక్కజొన్న పంట నాశనమైనట్లు వెలుగులోకి వచ్చింది. హడగలి తాలూకాలో మంచి వర్షాలు కురవడంతో మొక్కజొన్న పంట బాగా పండింది. అయితే దుండగులు రాత్రి పూట మొక్కజొన్న కంకులను కోసి, మొక్కలను పెకలించి పారిపోయారు. ఎవరో దుండగులు ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కష్టపడి, అప్పులు చేసి పండించిన పంటను నాశనం చేశారని రైతులు కన్నీరు పెట్టారు. హూవినహడగలి స్టేషన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ సంఘంలోని కొంత మంది సభ్యులు ద్వేషంతో ఇలా చేసి ఉండవచ్చు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసినట్లు హువిన హడగలి పోలీసులు తెలిపారు.