
కలబుర్గిలో లవ్‌జిహాద్?
● వారం నుంచి బీఎస్సీ విద్యార్థిని మిస్సింగ్
దొడ్డబళ్లాపురం: కలబుర్గిలో బీఎస్సీ చదివే యువతి అదృశ్యం కాగా, లవ్ జిహాద్ కారణమని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కలబుర్గి తాలూకా గొబ్బుర గ్రామ నివాసి, జైన్ మతానికి చెందిన యువతి గత నెల 30 నుంచి కనబడకుండాపోయింది. ఈమె కలబుర్గి నగరంలో ఒక కళాశాలలో బీఎస్సీ చదువుతోంది. కళాశాలకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు. ఆ యువతి అదే గ్రామానికి చెందిన మషాక్ అనే యువకునితో చనువుగా ఉండేదని, అతనితో మొబైల్‌ఫోన్‌లో చాటింగ్ చేసేదని తెలిసింది. విషయం తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఇది కచ్చితంగా లవ్ జిహాద్ అని, కుట్రలో భాగంగానే యువతిని ట్రాప్ చేసి తీసికెళ్లాడని ఆరోపిస్తున్నారు. గుల్బర్గ యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నాశనం చేశారు: తండ్రి
బాలిక తండ్రి మహావీర్ జైన్ మాట్లాడుతూ తమ కూతురు అదృశ్యమై 8 రోజులు గడిచినా పోలీసులు సరైన చర్యలు తీసుకోలేదని, ఆమె ఎక్కడ ఉందోనని ఆవేదన చెందాడు. పోలీసులు సక్రమంగా గాలించడం లేదు, ఇది లవ్‌జిహాద్ కుట్రగా అనుమానం ఉంది, నా కూతురు జీవితం నాశనమైపోయింది అని విలపించాడు. హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ మషాక్‌తో పాటు మరికొందరు మరో వర్గం అమ్మాయిలను ప్రేమపేరుతో అదృశ్యం చేస్తున్నారని, పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
మిత్రుని భార్యను చంపి, ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: మహిళను గొంతుకోసి హత్య చేసిన హంతకుడు, తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బెంగళూరు హెబ్బగోడి సమీంలోని తిరుపాళ్యలో జరిగింది. మందిర మండల్ (27) అనే మహిళను సుమన్ మండల్ (28)అనే వ్యక్తి గొంతుకోసి హత్య చేసి , ఉరివేసుకున్నాడు. వివరాలు.. వీరిద్దరూ పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని తెలిసింది. 8 ఏళ్ల క్రితం మందిర మండల్‌కు బిజోస్ మండల్ అనే వ్యక్తితో పెళ్లయి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే ఆమె భర్తను వదిలేసి ఆనేకల్ వద్ద తిరుపాళ్యలో నివసించేది. నిందితుడు సుమన్ మండల్ మందిర భర్తకు స్నేహితుడు. ఇద్దరి మధ్య అనైతిక సంబంధం ఉన్నట్లు అనుమానాలున్నాయి. 15 రోజుల నుంచి ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. మంగళవారం ఏదో విషయమై గొడవ చెలరేగింది. దీంతో కత్తితో గొంతు కోసి చంపి ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. హెబ్బగోడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పంచాయతీ ఉద్యోగి గల్లంతు
యశవంతపుర: రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తున్న వాగును దాటడానికి ప్రయత్నించిన బైకిస్టు కొట్టుకుపోయిన ఘటన బెళగావి సమీపంలోని తారిహళ వద్ద జరిగింది. తారిహళ పంచాయతి ఉద్యోగి సురేశ్ నిజగుణి గుండన్నవర్ (50) నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. పంచాయతీలో పని ముగించుకొని మంగళవారం రాత్రి బైకుపై ఇంటికి వెళుతుండగా వర్షం వల్ల రోడ్డు మీద వాగు ప్రవహిస్తోంది. దాటబోతూ ఉధృతికి కొట్టుకుపోయాడు. సురేశ్ కోసం గ్రామస్థులు వెతికినా జాడ లేదు. బుధవారం ఫైర్ సిబ్బంది వెతకడం ప్రారంభించారు.

కలబుర్గిలో లవ్‌జిహాద్?