
ఈ ఏడాదిలోనే జెడ్పీ, టీపీ ఎన్నికలు
హుబ్లీ: జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలను ఈ ఏడాదిలో గ్యారెంటీగా నిర్వహిస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే హామీ ఇచ్చారు. స్థానిక విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సదరు ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ జరుగుతోంది. రెండు, మూడు నెలల్లో నోటిఫికేషన్ వెల్లడిస్తామని ఆయన తెలిపారు. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు చేసిన ప్రతిపాదనను అంగీకరించాం. అయితే అంతర్గత ప్రక్రియ సాగుతోంది. ఈ ఏడాదిలోనే తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామన్నారు. సవదత్తి పాఠశాలలో నీటి ట్యాంకర్‌లో విషం కలిపిన ఘటనపై ఆయన మాట్లాడుతూ యూజీపీ, ఆర్‌ఎస్‌ఎస్ విష బీజాలు నాటే పనిని చేస్తున్నాయి. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి బదిలీ కోసం విషం కలిపారన్నారు. విషం కలిపింది ఎవరో తెలుసు. ఈ విషయంలో బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు. వారు ఎక్కడ దాక్కున్నారు? మత విష బీజాలు నాటిన ఫలితంగా పదే పదే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చిన్నారులను బలి తీసుకుంటున్నారు. అసలు వీరు మనుష్యులేనా? ఈ విషయంలో బీజేపీ నేత ఆర్.అశోక్, బసవరాజ్ బొమ్మై, అరవింద బెల్లదలనే ప్రశ్నించండి అంటూ ఆయన మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్నులు వేసినా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ప్రకటనపై కూడా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలి. శ్రీరామ సేన, ఆర్‌ఎస్‌ఎస్ ఏమి చేసినా కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలంటే బీజేపీ నేతలు నోటికి తాళం వేసుకున్నారా? అని బీజేపీ నేత తీరుపై ఖర్గే నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు మండిపడిన విషయమై మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ ఎంపీలే చెబుతున్నారు. చైనా 50, 60 కిలోమీటర్ల మేర మనదేశంలోకి ఆక్రమించింది. సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా ఇదే చెబుతున్నారు. అయినా కూడా నమ్మడం లేదన్నారు. దేశద్రోహులు ఎవరు అన్న సర్టిఫికెట్ తీసుకోవాలా? అని నిలదీశారు. బాగలకోటె జిల్లాలో ఓ విద్యార్థిపై ఉపాధ్యాయిని చేసిన కులదూషణ కేసులో ప్రభుత్వ ఉద్యోగులే అయినా వేరే ఎవరైనా కానీ కులదూషణకు పాల్పడే హక్కు ఎవరికీ లేదన్నారు.
మంత్రి ప్రియాంక్ ఖర్గే భరోసా