
ఆక్రమణల చెరలో మావినకెరె
రాయచూరు రూరల్: నగరంలోని మావినకెరె చెరువు ఆక్రమణల పాలవుతోంది. చారిత్రక ప్రసిద్ధి చెందిన చెరువును ఇష్టమొచ్చినట్లు కబ్జాదారులు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకున్నారు. మరోవైపు వాటిని ప్లాట్లుగా మార్చుకొని విక్రయాలు జరిగాయి. ఈ విషయంలో నగరసభ, జిల్లా పాలక మండలి, నగర అభివృద్ధి ప్రాధికార అధికారులు మౌనం వహించారు. 107 ఎకరాల్లో ఉన్న మావినకెరె చెరువు కేవలం ఐదు ఎకరాలకు పరిమితమైంది. మాజీ నగరసభ సభ్యులు, కాంట్రాక్టర్లు, బడా నాయకులు ఏకమై మావినకెరె చెరువును కబ్జా చేసుకొని దాని రూపు రేఖలను మార్చివేస్తున్నారు. బలమున్న వాడిదే అధికారం అన్నట్లు ఇష్టమొచ్చినట్లు ఆక్రమణలకు గురవుతున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువు పరిధిలో ఉన్న చెత్త చెదారం, మట్టి, రాళ్లు వేసి వాటిని కప్పి దానిని ఆక్రమించి ఇతరులకు విక్రయాలు చేస్తున్నారు. చెరువు అభివృద్ధికి ఆర్‌డీఏ నుంచి రూ.12 కోట్ల నిధులు విడుదల చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇందిరా నగర్, ఐడీఎస్‌ఎంటీ కాలనీల నుంచి మురుగు కాలువల ద్వారా మురుగు నీరు చెరువులోకి కలుస్తున్నాయి.

ఆక్రమణల చెరలో మావినకెరె