
విశ్రాంత సైనికుడికి ఘన స్వాగతం
హుబ్లీ: భారతీయ నౌకా సేనలో గత 15 ఏళ్లుగా సేవలు అందించి పదవీ విరమణ పొంది స్వగ్రామానికి విచ్చేసిన వీరయోధుడికి హావేరి జిల్లా మాజీ సైనికుల సంఘం ఘనంగా స్వాగతం పలికింది. హళేరిత్తి గ్రామానికి చెందిన బసవరాజ నింగప్ప వాలికార్ నౌకాసేనలో 15 ఏళ్లు విధులు నిర్వహించి మంగళవారం హావేరీకి వచ్చారు. ఈయనను మాజీ సైనికుల కార్యాలయం నుంచి హొసమనె సిద్దప్ప సర్కిల్ వరకు ఓపెన్ జీప్‌లో ఊరేగించి ఘనంగా స్వాగతం పలికారు. సదరు జీపు నిండా పూల అలంకరణ స్థానికులను ఆకట్టుకుంది. దేశభక్తి గీతాలను దారి పొడవున ఆలపించారు. చివరిగా యోధుడికి స్థానికులు ఘనంగా సెల్యూట్ చేసి గౌరవ వందనం సమర్పించారు. మరికొందరు పూలదండలు, కరచాలనాలతో ఆత్మీయంగా సైనికుడికి స్వాగతం పలికారు. కాగా ఆ సైనికుడు వివిధ విభాగాల్లో సేవలను అందించారని అందరూ గుర్తు చేసుకొన్నారు. కాగా సదరు సైనికుడు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు కొంత కాలం తప్పనిసరిగా సైన్యంలో పని చేయాలన్నారు. నేటి యువకులు దేశభక్తిని కేవలం సోషల్ మీడియాకే పరిమితం చేశారన్నారు. నిజమైన దేశభక్తిని చూపించేందుకు సైన్యంలో చేరాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.