
ప్రభుత్వ కళాశాలలో క్యాంపస్ సెలెక్షన్స్.!
హుబ్లీ: క్యాంపస్ సెలెక్షన్స్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు మాత్రమే పరిమితం అన్న మాటలు వినిపిస్తుంటాయి. అయితే బెళగావి జిల్లాలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గత నాలుగేళ్ల నుంచి క్యాంపస్ సెలెక్షన్లు జరుగుతున్నాయి. ఆ మేరకు 1000 మందికి పైగా విద్యార్థులు ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారు. అందులోను డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ ఫలితాలు రావడంతోటే ఉద్యోగాలు దొరకడం ఆ విద్యార్థుల్లో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అవును.. క్యాంపస్ టు కార్పొరేట్ కంపెనీ. బెళగావి ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ మహిళా కళాశాల ప్రొఫెసర్ల వినూత్న కార్యక్రమం విద్యార్థుల వృత్తి జీవితానికి దిక్సూచి కానుంది. ప్రైవేట్ కళాశాలల్లో సాధ్యం అయ్యే క్యాంపస్ సెలెక్షన్లు ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో చేపట్టడం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు డిగ్రీ ముగిసిన వెంటనే ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ఇందులో 90 శాతం మంది విద్యార్థినులే కావడం విశేషం. అక్కడి అధ్యాపక సిబ్బంది కృషి ఫలితంగానే ఇది సాధ్యం అయింది. ఎందుకై నా బీఏ, బీకాం, డిగ్రీ చదివామా? అని బాధపడే విద్యార్థులకు అలాంటి చింత వేధించరాదన్న సదుద్దేశంతోనే సదరు కళాశాల ప్లేస్‌మెంట్ అధికారి ప్రొఫెసర్ షంషుద్దీన్ నదాఫ్ తోటి ప్రొఫెసర్ల అండదండలతో గత మూడేళ్ల నుంచి క్యాంపస్ సెలెక్షన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం 730 మందికి పైగా విద్యార్థినులు టాటా ఎలక్ట్రానిక్, టాటా మోటర్స్ హోండా, ఫాక్స్‌కాన్, క్వేస్ తదితర ఎంఎన్‌సీ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ప్రత్యక్ష ఇంటర్వ్యూల్లో విద్యార్థులు ఈ ఘనత సాధించారని అధికారి ఎంతో గర్వంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ప్రభుత్వ కళాశాలలో క్యాంపస్ సెలెక్షన్స్.!