
కర్ణాటక సాగు నీటి పథకాలకు ఏపీ మోకాలడ్డు
రాయచూరు రూరల్: కర్ణాటకలో సాగు నీటి పథకాలకు ఆంధ్రప్రదేష్ ప్రభుత్వం మోకాలడ్డుతోందని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు్ ఆరోపించారు. మంగళవారం తమ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగభద్ర డ్యాంలో పేరుకున్న పూడికతో నష్టపోతున్న నీటి వాటాను భర్తీ చేసుకునేందుకు, వరద జలాలను నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రత్యామ్నాయంగా నవలి వద్ద రూ.20 వేల కోట్లతో మినీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సమావేశాలు నిర్వహించాలని విన్నవించినా నేటికీ స్పందించక పోవడాన్ని తప్పుబట్టారు.
బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణానికి సమీక్ష
రాయచూరు జిల్లాలో మాన్వి తాలూకా చీకలపర్వి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీ, రాయచూరు తాలూకా చిక్కమంచాలి వద్ద బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టడానికి అవకాశం కల్పించాలని కర్నూలులో సమావేశం నిర్వహించామన్నారు. ఈ విషయం కేసీ కెనాల్ పరిధిలో ఉన్నందున కర్నూలు, నంద్యాల లోక్‌సభ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి నిరభ్యంతర లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం అడ్డు పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ పరివాహక ప్రాంత పరిధిలో బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టడానికి గతంలో అవకాశం కల్పించిందని గుర్తు చేశారు.
జిల్లాలో యూరియా ఎరువుల కొరత లేదు
రాయచూరు జిల్లాలో ఎరువుల కొరత లేదన్నారు. ఆగస్టు నెలలో 8,146 టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు విషయంపై కేంద్రం వివక్షత చూపుతోందన్నారు. తుంగభద్ర డ్యాంలో 32 గేట్లను మార్పు చేయడానికి తుంగభద్ర బోర్డు అధ్యక్షుడి అనుమతి అవసరం అన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకరు గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారని, వారి ఆదేశాల మేరకు బోర్డు నిర్ణయం తీసుకోవడం వల్ల కర్ణాటక కేవలం పాత్రధారి మాత్రమే అన్నారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచరాదని కేంద్ర జలవనరుల మంత్రికి మహారాష్ట్ర ప్రతినిధులు వినతిపత్రం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ నిరసన తెలపడం సహజమన్నారు.
చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు