
తుంగభద్ర తీరాన క్యాన్సర్ భూతం?
ఈ ప్రాంతంలో ముప్పుంది
బనశంకరి: విపరీతంగా యూరియా ఎరువులు, అత్యంత విషపూరిత క్రిమిసంహారకాలను అన్నదాతలు వాడడం సాధారణ విషయమైంది. తెగుళ్ల నిరోధానికి, పంటల దిగుబడికి ఇవి తప్పదనే భావన నాటుకుపోయింది. అదే మనుషుల ఆరోగ్యానికి చేటు చేస్తోంది. అధిక ఎరువులు, పెస్టిసైడ్ల వల్ల ప్రత్యేకంగా తుంగభద్రా ఆయకట్టు జిల్లాలు అయిన బళ్లారి– విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాల్లో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ఎంతోమందిలో క్యాన్సర్ బయటపడుతోంది. ఈ జిల్లాలు క్యాన్సర్ నిలయాలు అవుతాయా? అనే భయాందోళన నెలకొంది.
జల వనరులు కలుషితం
పంటల ఎదుగుదల కు వాడే యూరియా, పెస్టిసైడ్లు భూమిలోకి, నీటి వనరుల్లోకి చేరుతాయి. నీరు ప్రవహించి నదులు, చెరువుల్లోకి చేరుతుంది. ఈ నీటిని వాడినప్పుడు క్యాన్సర్ తలెత్తే ప్రమాదముందని డాక్టర్ రవి, జేడీ టీ.రుద్రేశప్ప తెలిపారు. గత ఏడాది హుబ్లీ క్యాన్సర్ పరిశోధనా కేంద్రం నిపుణులు కొప్పళలో క్యాన్సర్ పరీక్షా శిబిరం నిర్వహించారు. హాజరైన ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిందన్నారు.
ఇక్కడే ఎందుకంటే
తుంగభద్ర నది తీరంలో పంటపొలాలు ఎక్కువగా ఉన్నాయి. ఏడాదిలో రెండు మూడు పంటలు పండిస్తుంటారు. దీనివల్ల రాష్ట్రంలో ఇతర జిల్లాల కంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఎరువులు, పెస్టిసైడ్లను ఉపయోగిస్తున్నారు. కలుపు నివారణకని అత్యంత విషపూరితమైన గడ్డి మందును వాడుతుంటారు. వీటితో తలెత్తే దుష్పరిణామాలు పట్ల అధ్యయనం చేయాలి. అలాగే పెరుగుతున్న క్యాన్సర్ రోగుల గురించి కూడా. ప్రభుత్వం ఈ దిశలో ప్రత్యేక అద్యయన బృందం ఏర్పాటు చేయాలని రవి, రుద్రేశప్ప డిమాండ్ చేశారు.
అధిక ఎరువుల వాడకం
క్యాన్సర్‌కు కారణమవుతోందని హెచ్చరిక
బళ్లారి, విజయనగర, కొప్పళ,
రాయచూరు జిల్లాల్లో అధిక కేసులు
విచ్చలవిడిగా యూరియా, పెస్టిసైడ్ల
వాడకమే కారణం
పిల్లల్లో రక్తహీనత బెడద
నిపుణుల హెచ్చరిక
గత 10 ఏళ్లలో ఆరంభం
కొప్పల జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ టీ.రుద్రేశప్ప, రాయచూరు వ్యవసాయ యూనివర్శిటీ ప్రొఫెసర్ డాక్టర్. రవి ఈ చేదు నిజాలను తెలిపారు.
కొప్పళ తో పాటు తుంగభద్రా నది ఆయకట్టు ప్రదేశాలలో గత పదేళ్లలో క్యాన్సర్ రోగుల సంఖ్య బాగా అధికమైంది.
జన్మించే పిల్లల్లో రక్తహీనత కనబడుతోంది.
వీటికి ప్రముఖ కారణం అధికంగా పంటపొలాల్లో ఎక్కువగా యూరియా, క్రిమిసంహారక మందులు చల్లడమేనని చెప్పారు.
కానీ దీనిపై నికరంగా చెప్పే ఎలాంటి అధ్యయన నివేదికలు ఇప్పటివరకు రాలేదు. కానీ అనేక అధ్యయనాలు జరిగాయి, నివేదికలను బహిర్గతం చేయలేదు. నివేదికలను బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయన్నారు.

తుంగభద్ర తీరాన క్యాన్సర్ భూతం?

తుంగభద్ర తీరాన క్యాన్సర్ భూతం?

తుంగభద్ర తీరాన క్యాన్సర్ భూతం?