
ఆగని తవ్వకాలు.. తీరని సస్పెన్స్
శివాజీనగర: ధర్మస్థలలో గుర్తు తెలియని శవాల కేసులో వారంరోజులుగా నేత్రావతి నది, పరిసర ప్రాంతాలలో సిట్, పోలీసులచే తవ్వకాలు కొనసాగుతున్నాయి. 6, 7 పాయింట్లలో మానవుల అస్థికలు దొరకడం తెలిసిందే. శనివారం కూడా మిగతా ప్రదేశాలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య తవ్వకాలు చేపట్టారు. ఫిర్యాదిదారు కూడా అక్కడే ఉన్నాడు.
మరో సంచలన ప్రకటన
మాజీ పౌర కార్మికుడు, ఫిర్యాదిదారు మరికొన్ని సంచలన విషయాలు చెప్పాడు. దావణగెరె జిల్లా హరిహరకు చెందిన అమ్మాయి మృతదేహాన్ని చూశాను, ఆమె వయసు 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఉండేది, ఆ బాలిక పాఠశాల యూనిఫారంలో ఉంది, లో దుస్తులు లేవు. లైంగిక దాడి జరిగినట్లు స్పష్టమైన లక్షణాలు కనిపించాయి. ఆమె మెడను పిసికిన గుర్తులున్నాయి. ఆ శవాన్ని చూపించి గుంతను తవ్వాలని ఆదేశించారు. ఆమెను పాఠశాల బ్యాగ్‌తో సహా పూడ్చాలని ఆదేశించారు, ఆ దృశ్యాలను ఇప్పటికీ మరచిపోలేకున్నాను అని చెప్పాడు. ఈ సమాచారంతో సిట్ అధికారులు హరిహరలో అదృశ్యమైన బాలికల కోసం సమాచారం సేకరణ చేస్తున్నారు. 2010లో ఓ పాఠశాల బాలిక అదృశ్యమైంది.ఽ ధర్మస్థల, బెళ్తంగడి పాఠశాలల్లో బాలికల మిస్సింగులపై అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.
హెల్ప్ లైన్‌కు కాల్స్
ప్రజలు ఫిర్యాదు చేయడానికి సిట్ రెండు రోజుల క్రితమే సహాయవాణిని ఆరంభించింది. ఆ సహాయవాణికి వందలాది ఫోన్‌లు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వందలాది మంది ఫోన్లు చేస్తున్నారు. విచారణ సంగతులను అడుగుతున్నారు. కొందరు సలహాలను కూడా ఇస్తున్నారని తెలిసింది. అయితే ఫిర్యాదులేవీ రాలేదని సిట్ వర్గాలు తెలిపాయి.
నిరసనలు
ధర్మస్థలలో హత్యలకు పాల్పడినవారిని చట్టం ముందు నిలిపి శిక్షించాలని శనివారం బెంగళూరులో పలు సంఘాలు ఆందోళనలు చేశాయి. హత్యకు గురైన సౌజన్యతో పాటు బాలికలు, యువతుల కుటుంబాలకు న్యాయం జరగాలని నినాదాలు చేశారు.
ధర్మస్థలలో మృతదేహాల కేసు..
పాఠశాల బాలికను
పూడ్చిపెట్టా: ఫిర్యాదిదారు